Spider-Man: Brand New Day Review: ఎమోషన్స్, యాక్షన్‌తో స్పైడర్ మ్యాన్ మరోసారి మెప్పించాడా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) ఎట్టకేలకు గురువారం థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా, 2021లో వచ్చిన 'స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్'కు కొనసాగింపుగా తెరకెక్కింది. ఈసారి హల్క్, ఫనీషర్, జీన్ వంటి శక్తివంతమైన పాత్రలు కథలో చేరడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? పీటర్ పార్కర్, ఎంజే ప్రేమకథకు ఎలాంటి ముగింపు దొరికింది? తెలుసుకుందాం.
వివరాలు
కథ
'నో వే హోమ్' ముగింపులో డాక్టర్ స్ట్రేంజ్ చేసిన మంత్రం కారణంగా పీటర్ పార్కర్ తప్ప ప్రపంచమంతా స్పైడర్‌మ్యాన్‌ను పూర్తిగా మరిచిపోతుంది. అతని ప్రేయసి ఎంజే, స్నేహితుడు నెడ్ కూడా అతడిని గుర్తించలేరు.
ఆ తర్వాత పీటర్ తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కనపెట్టి, కేవలం స్పైడర్‌మ్యాన్గా న్యూయార్క్ నగరాన్ని కాపాడుతూ జీవిస్తుంటాడు.
గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఒంటరిగా బాధపడతాడు. రహస్యంగా సోషల్ మీడియాలో తన స్నేహితులను ఫాలో అవుతుంటాడు.
ఒకరోజు ఎంజే మరో వ్యక్తితో ప్రేమలో ఉండడం చూసి తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతాడు.
దాంతో అతని సూపర్ పవర్స్‌పైనా ప్రభావం పడుతుంది. ఒక్కోసారి అతడు హైపర్‌గా మారడం, మరికొన్ని సందర్భాల్లో బలహీనపడటం జరుగుతుంది.
వివరాలు
అదృశ్య శక్తితో పోరాటం
అదే సమయంలో కనిపించని ఓ అదృశ్య శక్తి మనుషుల మనసులను తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ, సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తులను పర్యవేక్షించే డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (DODC) కేంద్రంపై దాడి చేస్తుంది. స్పైడర్‌మ్యాన్ అక్కడికి చేరుకున్నా ఆ దాడిని పూర్తిగా అడ్డుకోలేడు.
ఆ రహస్య శక్తి స్పైడర్‌మ్యాన్ మనసును కూడా నియంత్రించాలని ప్రయత్నించినా విఫలమవుతుంది.
ఈ దాడి వెనుక 'వి మ్యాక్స్' అనే రహస్య వస్తువు ఉందని తెలుసుకున్న పీటర్, ఆ శక్తి అసలు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.
ఈ క్రమంలో సాధారణ మనిషిలా ఉన్న 'హల్క్' అదుపు తప్పడంతో అతడితోనూ పోరాడాల్సి వస్తుంది. అసలు ఆ అదృశ్య శక్తి ఎవరు? నగరాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంది?
వివరాలు
విశ్లేషణ
స్పైడర్‌మ్యాన్ ప్రజలను ఎలా కాపాడాడు? ఫనీషర్ ఎలా సాయం చేశాడు?
హల్క్ ఎందుకు స్పైడర్‌మ్యాన్‌తో తలపడాల్సి వచ్చింది? అనే అంశాలతో సినిమా ముందుకు సాగుతుంది.
దర్శకుడు కథను 'నో వే హోమ్' ముగిసిన చోట నుంచే ప్రారంభించి ఎలాంటి అనవసర సన్నివేశాలకు తావివ్వకుండా నేరుగా ప్రధాన కథలోకి తీసుకెళ్లారు.
తనను మరిచిపోయిన ప్రేయసి, స్నేహితుల జ్ఞాపకాలతో పీటర్ పడే మానసిక వేదన, శక్తులు తగ్గిపోవడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. మొదట కోపంతో రగిలిపోయే ఫనీషర్‌తో స్పైడర్‌మ్యాన్ చేసే యాక్షన్ ఫైట్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
అనంతరం ఇద్దరి మధ్య ఏర్పడే స్నేహం, అదే సమయంలో తన ప్రేమను కాపాడుకునేందుకు పీటర్ చేసే ప్రయత్నాలు హృదయానికి హత్తుకుంటాయి.
వివరాలు
స్పైడర్‌మ్యాన్ తలపడే ప్రతి సన్నివేశం గూస్‌బంప్స్
క్లైమాక్స్‌కు ముందు ఇతరుల మనసులను నియంత్రించే అదృశ్య శక్తితో స్పైడర్‌మ్యాన్ తలపడే ప్రతి సన్నివేశం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
మరోవైపు అదుపు తప్పిన హల్క్‌ను శాంతింపజేసేందుకు ఫనీషర్‌తో కలిసి స్పైడర్‌మ్యాన్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు, చివర్లో జరిగే పోరాటం ప్రేక్షకులను అలరిస్తాయి.
అయితే పూర్తిగా యాక్షన్ సినిమా ఆశించి వెళ్లే వారికి మాత్రం కొంత నిరాశ కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే దర్శకుడు యాక్షన్ కంటే ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
సినిమాలోని విజువల్స్, CGI, గ్రాఫిక్స్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా స్పైడర్‌మ్యాన్ గాల్లో విహరించే సన్నివేశాలు గత చిత్రాల కంటే మరింత అద్భుతంగా అనిపిస్తాయి.
వివరాలు
ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి
3డీలో వీటిని చూడడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా కొన్ని జంప్ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడతాయి.
అయితే సాధారణ స్క్రీన్‌లో చూసే వారికి ఆ అనుభూతి కొంత తగ్గవచ్చు. ఇక హల్క్ పాత్రను కేవలం ఒకటి రెండు ఘట్టాలకే పరిమితం చేయడం మాత్రం అభిమానులను కొంత నిరాశపరుస్తుంది.
ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి థియేటర్లు మార్మోగేలా స్పందన లభిస్తుంది.
వివరాలు
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
టామ్ హాలెండ్ మరోసారి పీటర్ పార్కర్, స్పైడర్‌మ్యాన్ రెండు పాత్రల్లో అద్భుతంగా నటించాడు.
ఒకవైపు శక్తివంతమైన శత్రువులతో పోరాడుతూనే, మరోవైపు ప్రేమను కోల్పోయిన యువకుడి బాధను హృదయానికి హత్తుకునేలా చూపించాడు.
ఇది అతని కెరీర్‌లోనే అత్యుత్తమ నటనల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఎంజే పాత్రలో జెండయా తన సహజ నటనతో ఆకట్టుకున్నప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో కాస్త బొద్దుగా కనిపిస్తుంది.
నెడ్ పాత్ర నిడివి తక్కువే అయినా క్లైమాక్స్‌లో వచ్చే చిన్న సన్నివేశం మంచి హైని అందిస్తుంది. ఫనీషర్ పాత్రలో జాన్ బెర్న్థల్, జీన్ పాత్రలో సాడీ సింక్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
బ్రూస్ బ్యానర్/హల్క్ పాత్రలో మార్క్ రఫెలో కనిపించిన కొద్దిసేపే ప్రేక్షకులను అలరించాడు.
వివరాలు
కొరియోగ్రఫీ అద్భుతం
సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి.
'షాంగ్-చీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్' వంటి విజయం తర్వాత దర్శకుడు డెస్టిన్ డానియెల్ క్రెట్టన్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆయన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.
ముఖ్యంగా సినిమాలో అసభ్యకరమైన లేదా అశ్లీల సన్నివేశాలు లేకపోవడం, యాక్షన్ ఎక్కువగా ఉన్నప్పటికీ రక్తపాతం చూపించకుండా రూపొందించడం విశేషం.
అందువల్ల కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఎలాంటి సందేహం లేకుండా ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు.
వివరాలు
ఫైనల్ వర్డిక్ట్
'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాకపోయినా, భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, టామ్ హాలెండ్ అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించే సూపర్‌హీరో సినిమా.
ముఖ్యంగా 3డీ ఫార్మాట్‌లో చూస్తే మరింత థ్రిల్లింగ్ అనుభూతి లభిస్తుంది. అభిమానులు తప్పక థియేటర్‌లో ఆస్వాదించాల్సిన చిత్రంగా చెప్పొచ్చు.