Loading...
Dulquer Salmaan: మళ్లీ 'కల్కి'లోకి దుల్కర్‌.. పార్ట్‌-2లో కీలక పాత్ర?
మళ్లీ 'కల్కి'లోకి దుల్కర్‌.. పార్ట్‌-2లో కీలక పాత్ర?

Dulquer Salmaan: మళ్లీ 'కల్కి'లోకి దుల్కర్‌.. పార్ట్‌-2లో కీలక పాత్ర?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'కి సీక్వెల్‌గా 'కల్కి 2898 ఏడీ 2' రూపొందనున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కూడా కనిపించారు. ప్రభాస్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో కొద్దిసేపు మాత్రమే కనిపించే దుల్కర్‌ పాత్ర.. ఆ తర్వాత కథలో పెద్దగా కనిపించదు. అయితే ఇప్పుడు ఈ పాత్రను 'కల్కి 2'లో మరోసారి తీసుకురానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీక్వెల్‌లో అమితాబ్‌ బచ్చన్‌, ప్రభాస్‌, కమల్‌ హాసన్‌ పాత్రల చుట్టూనే కథ ప్రధానంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ఇక తొలి భాగంలో అత్యంత కీలకమైన సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకోన్‌ స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోవడం లేదని సమాచారం.

వివరాలు

ఇప్పటివరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు

మిగిలిన పాత్రలతోనే కథను ముందుకు తీసుకెళ్లనున్నట్లు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్క్రీన్‌ప్లేలో చేసిన కొన్ని మార్పుల కారణంగా దుల్కర్‌ సల్మాన్‌ పాత్రను కథలో కీలకమైన సమయంలో మరోసారి తీసుకురానున్నట్లు సమాచారం.

అయితే ఇది నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కు దుల్కర్‌పై ఉన్న సెంటిమెంట్‌లో భాగమా? లేక కథకు అవసరమైన మార్పుల్లో భాగంగా ఆయన పాత్రను తిరిగి తీసుకొస్తున్నారా? అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు.

అయితే దుల్కర్‌ సల్మాన్‌ 'కల్కి 2'లో నటిస్తున్నారనే వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

దీంతో ఈ ప్రచారంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. రానున్న రోజుల్లో చిత్రబృందం దీనిపై అధికారికంగా ఏమైనా ప్రకటిస్తుందేమో చూడాలి.

ADVERTISEMENT