Ee Paata Korinavaaru Trailer : 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి' ట్రైలర్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా టైటిల్‌నే ఆసక్తికరంగా మార్చిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్.. తాజాగా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు' సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా, ఇదీ సంగతి, ఆటగదరా శివా వంటి విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చంద్ర సిద్ధార్థ్.. కొంత విరామం తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇటీవల సినిమా టైటిల్‌ను ప్రకటించినప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
వివరాలు
'ఎ ఫర్‌బిడెన్ రాగ్ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా..'
'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు' అనే సుదీర్ఘమైన టైటిల్‌ను పెట్టడం విశేషంగా మారింది.
దీనికి 'ఎ ఫర్‌బిడెన్ రాగ్ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా..' అనే సబ్‌టైటిల్‌ను కూడా జోడించారు.
ఈ చిత్రంలో హర్ష హీరోగా నటిస్తుండగా.. అమైరా గోస్వామి, సుజనా రెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది.
వై.వి. సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలోనే నిర్మించారు. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వివరాలు
అనిల్ రావిపూడి ఏమన్నారంటే..
ట్రైలర్ విడుదల అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఇంత పెద్ద టైటిల్‌తో సినిమా రావడం ఆసక్తికరంగా ఉంది. చంద్ర సిద్ధార్థ్ గారి 'మధుమాసం', 'హౌస్‌ఫుల్', 'అందరి బంధువయా' చిత్రాలకు నేను స్క్రిప్ట్ విభాగంలో పనిచేశాను. ఆయన చాలా సెన్సిబుల్ సినిమాలు తీశారు. ఈ పొడవాటి టైటిల్‌తో వస్తున్న సినిమా కూడా విజయం సాధించాలి'' అని ఆకాంక్షించారు.
వివరాలు
చంద్ర సిద్ధార్థ్ స్పందన..
దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ''మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ఆయన బిజీ షెడ్యూల్‌లోనూ మాకు కొంత సమయం కేటాయించారు. మా సినిమా టైటిల్‌కు మంచి స్పందన వస్తోంది. టైటిల్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని, క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుంది'' అని తెలిపారు.