Singer Shaan: ప్రముఖ సింగర్ షాన్ నివాస భవనంలో చెలరేగిన మంటలు
ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ గాయకుడు షాన్ నివసించే ఫార్చ్యూన్ ఎన్‌క్లేవ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఏడో అంతస్తులో జరిగింది, సమాచారం అందిన వెంటనే అనేక అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలు తీవ్రంగా వ్యాపించకముందే ఆర్పివేశారు, అయితే ప్రమాదం సమయంలో, షాన్ ఇంట్లో ఉన్నాడా లేదా అనే విషయాలు ఇంకా తెలియలేదు. షాన్ 11వ అంతస్తులో నివసిస్తుండగా, మంటలు ఆ అంతస్తుకు చేరుకోకముందే అదుపులోకి వచ్చినట్లుగా సమాచారం అందింది.
షాన్ తాత జహర్ ముఖర్జీ ప్రసిద్ధ గీత రచయిత
షాన్ పూర్తి పేరు శంతను ముఖర్జీ. 1972 సెప్టెంబరు 30న ముంబైలోని బెంగాలీ కుటుంబంలో జన్మించిన షాన్, తన సంగీత సామర్థ్యంతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు. అతని తండ్రి మానస్ ముఖర్జీ ఒక సంగీత దర్శకుడిగా, సోదరి సాగరిక గాయకురాలిగా పేరుపొందారు. షాన్ తాత జహర్ ముఖర్జీ ప్రసిద్ధ గీత రచయిత. షాన్ తెలుగు సినీ సంగీతంలో కూడా ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. నాని నటించిన "ఎటో వెళ్లిపోయింది మనసు"లోని "ఏది ఏది," ప్రేమ ఖైదీ చిత్రంలో "మైనా మైనా," కమల్ హాసన్ దశావతారం చిత్రంలో "హో హో సనమ్ హో హో సనమ్," నాగార్జున మన్మథుడు సినిమాలో "చెలియా చెలియా" వంటి పాటలకు తన గాత్రం అందించారు.