అక్కినేని అమల బర్త్ డే: భరతనాట్యంలో డ్రిగీ పొంది.. నటిగా మారిన అమల కెరీర్ విశేషాలు
అక్కినేని అమల... నాగార్జున భార్యగా అందరికీ తెలిసిన అమల, ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల సినిమాల్లో అమల నటించారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగార్జునను పెళ్ళి చేసుకుని నటనకు స్వస్తి చెప్పారు. ఈరోజు అమల పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అక్కినేని అమల పశ్చిమ బెంగాల్ లో జన్మించారు. తండ్రి నేవీ ఆఫీసర్ కావడంతో ఉద్యోగ నిమిత్తం చెన్నై వచ్చేసారు. అమల బాల్యం మొత్తం చెన్నైలోనే గడిచింది. భరతనాట్యంలో అమల ప్రతిభను చూసిన దర్శకుడు టి రాజేందర్, అమల తల్లిదండ్రులతో మాట్లాడి సినిమాల్లోకి రావడానికి ఒప్పించారు. అలా అమల మొదటి చిత్రం మైథిలి ఎన్నై కాదల్(1986) విడుదలైంది.
నాగార్జునతో అమల నటించిన సినిమాలు
అమల నటించిన మొదటి చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతేకాదు, ఈ సినిమాలోని నటనకు గాను ఉత్తమ నటి విభాగంలో ఫిలిమ్ ఫేర్ అవార్డుల్లో అమలకు నామినేషన్ దక్కింది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇటు తెలుగులో కిరాయి దాదా(1987)లో మొదటిసారిగా అమల కనిపించింది. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించారు. కిరాయి దాదా కూడా అమలకు మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలైంది. నాగార్జున, అమల జంటగా నటించిన సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చేది. వీళ్ళిద్దరూ కలిసి కిరాయి దాదా, శివ, ప్రేమయుద్ధం, నిర్ణయం సినిమాల్లో నటించారు.
పెళ్ళి తర్వాత సినిమాలకు బై చెప్పిన అమల
1992లో నాగార్జునను అమల పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి తర్వాత అమల నటించిన ఆగ్రహం(1993) చిత్రం విడుదలైంది. 1993నుండి 2012వరకు సినిమాలకు అమల దూరంగా ఉన్నారు. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అమ్మ పాత్రలో అమల కనిపించారు. ఆ తర్వాత 2014లో అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం చిత్రంలో అమల కనిపించారు. 2022లో శర్వానంద్ హీరోగా రూపొందిన ఒకే ఒక జీవితం సినిమాలో మరోసారి అమ్మ పాత్రలో అమల నటించి మెప్పించారు. సినిమాలను పక్కనపెడితే జంతు సంరక్షణల కోసం బ్లూ క్రాస్ సంస్థను అమల ఏర్పాటు చేసారు.