ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్: సమ్మె బాట పట్టిన హాలీవుడ్ రచయితలు, నటీనటులు
హాలీవుడ్ ఇండస్ట్రీ నటీనటులు సమ్మె బాట పట్టారు. రెమ్యునరేషన్ పెంచాలని, భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, కృత్రిమ మేధస్సు వల్ల భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను తప్పించాలని నిర్మాతలను, స్టూడియోలను డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. నిజానికి కొన్ని రోజుల క్రితం నుండి హాలీవుడ్ రచయితలు అంతా సమ్మె చేస్తున్నారు. తమకు రెమ్యునరేషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ అమెరికన్ రైటర్స్ గిల్డ్ యూనియన్ సమ్మె నిర్వహిస్తోంది. తాజాగా రచయితలకు మద్దతుగా నటీనటులు కూడా జాయిన్ అయ్యారు. మొత్తం 1,60,000మంది నటీనటులు షూటింగులను పక్కకు పెట్టి రోడ్డు మీదకు ఎక్కారు. గత 60ఏళ్ళలో ఇలా రెండు యూనియన్లు కలిసి సమ్మె చేయడం ఇదే మొదటిసారి.
సమ్మెలో పాల్గొంటున్న టామ్ క్రూజ్, ఏంజెలీనా జోలీ
1960లో నటుడు రోనాల్డ్ రీగన్ ఆధ్వర్యంలో సమ్మె జరిగింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు అటు స్క్రీన్ రైటర్స్, యాక్టర్స్ కలిసి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెవల్ల టెలివిజన్ సిరీస్, థియేట్రికల్ సినిమాలకు దెబ్బ పడనుంది. హాలీవుడ్ లో పెద్ద సినిమాలుగా చెప్పుకునే సినిమా విడుదలలు ఆలస్యం కానున్నాయి. హాలీవుడ్ తారలైన టామ్ క్రూజ్, ఏంజెలీనా జోలీ, మెరిల్ స్ట్రీప్, బెన్ స్టిల్లర్, కోలీన్ ఫారెల్ మొదలగు నటీనటులు ఈ సమ్మెకు మద్దతు తెలుపుతూ రోడ్ల మీదకు వస్తున్నారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో రిలీజ్ కాబోయే అమెరికన్ సిరీస్ ల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి.