
Kantara Chapter 1: బాక్సాఫీస్ వద్ద కాంతారా చాప్టర్ 1 హవా.. నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్ లోకి!
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతారా చాప్టర్-1' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తూ, విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరింది. అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదలైన ఈ చిత్రం, తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ హౌస్‌ఫుల్ షోలు సాధిస్తోంది. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా, మౌత్ టాక్‌తో అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.235 కోట్లు వసూలు చేసింది.
Details
కలెక్షన్ల ప్రభంజనంతో సరికొత్త రికార్డు
నాలుగో రోజున ఒక్క భారత్‌లోనే రూ.61.5 కోట్లు రాబట్టింది. ఇందులో హిందీ వెర్షన్ నుంచి రూ.23.5 కోట్లు, కన్నడ నుంచి రూ.15.5 కోట్లు, తెలుగు నుంచి రూ.11.25 కోట్లు, తమిళం నుంచి రూ.6.5 కోట్లు, మలయాళం నుంచి రూ.4.75 కోట్లు వసూలయ్యాయి. దీంతో కేవలం నాలుగు రోజుల్లోనే మొత్తం కలెక్షన్లు రూ.300 కోట్ల మార్క్‌ను దాటాయి. 'కాంతారా చాప్టర్ 1' ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో, 7 భాషల్లో, దాదాపు 7000 థియేటర్లలో విడుదలైంది. కేజీఎఫ్ 2 తర్వాత వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉన్న తదుపరి కన్నడ సినిమాగా ఇది నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Details
కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం
రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరో-హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు జయరాం కీలక పాత్ర పోషించారు. రిషబ్ శెట్టికి అభిమానులు 'డివైన్ స్టార్' అనే బిరుదును కట్టబెట్టారు. దీపావళి వరకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడం వల్ల 'కాంతారా చాప్టర్ 1'కు మరింతగా కలెక్షన్లు వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో ప్రకారం ఇప్పటివరకు 50 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. కేవలం గత 24 గంటల్లోనే ఒక మిలియన్‌కి పైగా టికెట్లు బుకింగ్ కావడం 'కాంతారా మేనియా' ఎంత దూకుడులో ఉందో స్పష్టంగా చూపిస్తోంది.