
kantara chapter 1 review: రివ్యూ: కాంతార: చాప్టర్-1.. దేవతల లోకంలోకి తీసుకెళ్లిన 'కాంతార చాప్టర్ 1
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న రిషబ్ శెట్టి 'కాంతార'తో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విజయం తర్వాత ఆయన 'కాంతార' ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా ఏ విధమైన కథను చెబుతోంది? ఆ అనుభూతి వెండితెరపై ఎలా మలిచారు? మొదటి భాగం మాదిరిగానే ఈ చిత్రం మళ్లీ ప్రేక్షకుల మనసులు దోచుకుందా అన్నది ఇప్పుడు చూద్దాం.
వివరాలు
కథా సారాంశం
ఈ సినిమా నేపథ్యం 8వ శతాబ్దంలో కదంబుల రాజ్యం. ఆ రాజ్యంలో ఒక వైపున ఉన్న అటవీప్రాంతమే 'కాంతార'. అక్కడున్న ఈశ్వరుడి పూదోట,మార్మిక బావికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర స్థలంపై బాహ్యుల కన్నుపడకుండా కాపాడటమే కాంతారా గిరిజన తెగ ప్రధాన కర్తవ్యంగా తీసుకుంటుంది. మిరియాలు,యాలకులు,దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాల పంటలతో జీవనం సాగించే ఈ తెగకు ఒకరోజు ఆ బావిలో ఓ శిశువు లభిస్తాడు. దైవానుగ్రహంగా భావించి అతనికి 'బెర్మే' (రిషబ్ శెట్టి) అని పేరు పెట్టి పెంచుతారు. ఇదే సమయంలో భాంగ్రా యువరాజు కులశేఖర (గుల్షన్ దేవయ్య) తన సైన్యంతో ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టాలని యత్నిస్తాడు.
వివరాలు
కథా సారాంశం
అతనికి బెర్మే ప్రతిఘటించి గట్టి బుద్ధి చెప్తాడు. ఆ సంఘటన తర్వాత గిరిజనులపై వెట్టి పేరుతో జరుగుతున్న హింసలు, విదేశీ వ్యాపారంలో రాజు దోపిడీలు అన్నీ బెర్మే కళ్లకు కనిపిస్తాయి. ఈ పరిస్థితుల మధ్య అతను తన జాతి కోసం తిరుగుబాటు చేసి, భాంగ్రా రాజును ఎదిరించి స్వతంత్రంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది? బెర్మే తీసుకున్న నిర్ణయం కాంతార గిరిజన తెగకు ముప్పుగా ఎందుకు మారింది?భాంగ్రా రాజు రాజశేఖర్ (జయరామ్) ఆయన కుమార్తె కనకావతికి (రుక్మిణి వసంత్) ఈ కథలో ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏంటి? అన్నది చిత్ర కథ
వివరాలు
ఎలా ఉందంటే..
'కాంతార'లో హీరో తండ్రి అదృశ్యమయ్యే చోటే ఈ కథ మొదలవుతుంది. ఇక్కడ కాంతార ప్రాంతం వెనుక ఉన్న దైవికత, ఈశ్వరుడి పూదోట, బావి రహస్యాలు, పంజుర్లి-గులిగ గణాల ఆవిర్భావం వంటి అంశాలను అన్వేషిస్తూ కథ క్రమంగా ముందుకు సాగుతుంది. మొదటి 20 నిమిషాల్లోనే గిరిజనుల జీవన విధానం, రాజు అణచివేతలు, ఈశ్వర పూదోటలో చోటుచేసుకునే సంఘటనలు థ్రిల్ కలిగిస్తాయి. ముఖ్యంగా ఈశ్వర గణాల పరిచయం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. హీరో రాజును ఎదిరించి వ్యాపారం చేయాలని నిర్ణయించుకోవడం కథలో కొత్త మలుపు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే టైగర్ సీక్వెన్స్ అద్భుతంగా కుదిరింది. అంతే కాకుండా చివరి భాగంలో హీరో చేసే రుద్ర యాక్షన్ సన్నివేశాలు గూస్‌బంప్స్ కలిగిస్తాయి.
వివరాలు
ఎలా ఉందంటే..
మొదటి భాగం కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ, రెండో భాగం చాలా వేగంగా, ఉత్కంఠభరితంగా నడుస్తుంది. కులశేఖర తెగను నాశనం చేయాలనే ప్రయత్నం, ఈశ్వర పూదోటలో అతడు చేసిన విధ్వంసం, గులిగ రూపంలో బెర్మే చేసే యుద్ధం.. అన్ని కలిపి ప్రేక్షకులను ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాయి. ప్రీక్లైమాక్స్‌లో కనకావతి పాత్రలోని కొత్త కోణం బయటపడుతుంది. ముఖ్యంగా హీరో గతం, దైవిక బావితో ఉన్న సంబంధాన్ని చూపించిన తీరు అద్భుతం. క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి చేసే చండిక తాండవం ఆహ్లాదకరమైన రీతిలో ముగుస్తుంది. చివరగా 'కాంతార: చాప్టర్ 2'కి పునాదులు వేసేలా ముగింపుని ఇచ్చారు.
వివరాలు
నటీనటులు, సాంకేతికత
ఈ చిత్రం రిషబ్ శెట్టి వన్‌మ్యాన్ షో అని చెప్పొచ్చు. దర్శకుడిగా కథ అల్లిన తీరు, నటుడిగా ఆ పాత్రకు న్యాయం చేసిన తీరు అద్భుతం. రుద్ర గులిగలా, చండికలా తెరపై ఆయన చేసిన అభినయాలు పూనకాలు తెప్పిస్తాయి. కనకావతి పాత్రలో రుక్మిణి వసంత్ ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించారు. జయరామ్ పాత్ర మొదట సాదాసీదాగా అనిపించినా, క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించారు. 'కాంతార'లో నవ్వులు పంచిన గ్యాంగ్ ఈ చిత్రంలో కూడా రిపీట్ అయ్యింది. సంగీతం విషయంలో అజనీష్ లోక్‌నాథ్ మరో హీరోగా నిలిచారు. ఇంటర్వెల్, ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి మరో స్థాయి తీసుకొచ్చింది. పాటలు కూడా కథలో భాగమయ్యాయి.
వివరాలు
నటీనటులు, సాంకేతికత
విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా కుదిరాయి. టైగర్ సీక్వెన్స్, కోతుల గుంపుతో చేసిన సన్నివేశాలు, దైవిక దృశ్యాలన్నీ కనువిందు చేస్తాయి. కెమెరా పనితనం అడవి సోయగాలను మంత్రముగ్ధులను చేసేలా చూపించింది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి.
వివరాలు
బలాలు
రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం దైవిక అంశాల మేళవింపు యాక్షన్ సన్నివేశాలు బలహీనతలు మొదటి భాగంలో కొన్ని నెమ్మదిగా సాగే సన్నివేశాలు చివరిగా: 'కాంతార చాప్టర్ 1' ఒక దైవిక అనుభూతి. రిషబ్ శెట్టి అద్భుతమైన నటన, శక్తివంతమైన కథనం, సాంకేతిక బలాలతో ఈ సినిమా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లుతుంది. చివరికి ఇది నిజంగానే ఒక ఈశ్వర దర్శనం అని చెప్పొచ్చు. గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!