
లోకేష్ కనగరాజ్ లైనప్ లో స్టార్ హీరోలు, ఈసారి రజనీ కాంత్ తో సినిమా?
ఈ వార్తాకథనం ఏంటి
నగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్ కనగరాజ్, ఆ తర్వాత తీసిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాల ద్వారా బాగా పేరు తెచ్చుకున్నాడు.
చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కి విక్రమ్ తో మంచి విజయాన్ని అందించాడు లోకేష్. ప్రస్తుతం తలపతి విజయ్ హీరోగా లియో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
విజయ్, లోకేష్ కాంబిలో వస్తున్న రెండవ సినిమా ఇది. అయితే లియో అనంతరం, రజనీకాంత్ ని డైరెక్ట్ చేయబోతున్నాడట. ఈ మేరకు చెన్నై ఫిలిమ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం రజనీకాంత్, జైలర్ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. జైలర్ తర్వాత జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.
రజనీకాంత్
టీజే జ్ఞానవేల్ చిత్రం పూర్తయ్యాక ప్రారంభం కానున్న లోకేష్ దర్శకత్వంలోని సినిమా
పై రెండు సినిమాలు పూర్తయిన తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయాలని రజనీకాంత్ అనుకుంటున్నారట. నిజానికి కమల్ హాసన్ తో విక్రమ్ పూర్తికాగానే రజనీ కాంత్ హీరోగా సినిమా తీయాలని లోకేష్ అనుకున్నారట.
కానీ కుదరకపోవడం వల్ల రజనీకాంత్ తో సినిమా వాయిదా పడిందని అంటున్నారు. అయితే టీజే జ్ఞానవేల్ రూపొందిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తి కావడానికి చాలా టైమ్ పడుతుందట. 2024 ద్వితియార్థంలో ఈ సినిమా పూర్తవుతుందని అంటున్నారు.
ఆ తర్వాతే లోకేష్ దర్శకత్వంలో సినిమా మొదలవుతుందట. అంటే అప్పటిలోగా ఇటు లియోతో పాటు మరో సినిమాను కూడా లోకేష్ తెరకెక్కించవచ్చని అంచనా వేస్తున్నారు.
మరేం జరుగుతుందో చూడాలి.