Loading...
Mamitha Baiju: ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లోకి మలయాళ క్రష్‌.. 'జై హనుమాన్‌'లో ఛాన్స్‌?
ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లోకి మలయాళ క్రష్‌.. 'జై హనుమాన్‌'లో ఛాన్స్‌?

Mamitha Baiju: ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లోకి మలయాళ క్రష్‌.. 'జై హనుమాన్‌'లో ఛాన్స్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2026
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

'హను-మాన్‌' సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అదే 'జై హనుమాన్‌'. 'కాంతార' ఫేమ్‌ రిషబ్‌ శెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయంపై గత కొంతకాలంగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరపడినట్లు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. యూత్‌లో విశేష క్రేజ్‌ సంపాదించుకున్న మలయాళ నటి మమితా బైజు 'జై హనుమాన్‌'లో ఫిమేల్‌ లీడ్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.

వివరాలు

త్వరలోనే అధికారికంగా పరిచయం

'ప్రేమలు' సినిమాతో యువతలో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్న మమితా బైజును.. మైథలాజికల్‌ యాక్షన్‌ డ్రామాలో రిషబ్‌ శెట్టి సరసన నటింపజేయనున్నారనే ప్రచారం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

దైవిక అంశాలతో పాటు శక్తిమంతమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో మమితా పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సాధారణంగా ఇలాంటి పాన్‌ ఇండియా సినిమాల్లో నటీనటులను భారీ పోస్టర్లు, ప్రత్యేక ప్రకటనల ద్వారా చిత్రబృందం అధికారికంగా పరిచయం చేస్తుంటుంది.

అయితే 'జై హనుమాన్‌' విషయంలో మాత్రం ప్రశాంత్‌ వర్మ తనదైన శైలిలో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

అధికారిక ప్రకటన వెలువడలేదు

ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే మమితా బైజు కొద్ది రోజుల క్రితమే రహస్యంగా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం జరుగుతున్న కీలక షెడ్యూల్‌లో ఆమె రిషబ్‌ శెట్టితో కలిసి నటిస్తున్నట్లు సమాచారం. అయితే మమితా బైజు హీరోయిన్‌గా ఎంపికైనట్లు వస్తున్న వార్తలపై ఇప్పటివరకు చిత్రబృందం అధికారికంగా స్పందించలేదు.

దీంతో ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT