Miss World 2024: 'మిస్ వరల్డ్ 2024' కిరీటాన్ని గెలుచుకున్న క్రిస్టినా పిస్కోవా ఎవరు?
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం జరిగిన 'మిస్ వరల్డ్ 2024' పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా విజేతగా నిలిచింది. ఈ పోటీలో భారత్ తరఫున బెంగళూరుకు చెందిన సిని శెట్టి ప్రాతినిధ్యం వహించింది. కానీ ఆమెకు టాప్ 4లో చోటు దక్కలేదు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో 115 కంటే ఎక్కువ దేశాల నుంచి సుందరీమణులు పోటీ పడ్డారు. ఈ అందాల పోటీలో 24ఏళ్ల క్రిస్టినా ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుంది. 'మిస్ వరల్డ్ 2022' టైటిల్ విజేత పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా.. ఈ షోలో క్రిస్టినాకు కిరీటాన్ని బహూకరించారు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 71వ ప్రపంచ సుందరి ముంబైలో నిర్వహించారు.
క్రిస్టినాకు ఎంత ప్రైజ్ మనీ?
మిస్ వరల్డ్ కిరీటం ధర రూ.82 నుంచి 85 లక్షలు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ కిరీటాన్ని ఒక సంవత్సరం మాత్రమే తమ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏడాది గెలిచిన విశ్వసుందరికి ఆ కిరీటాన్ని అందించాల్సి ఉంటుంది. అలాగే, మిస్ వరల్డ్ విజేతకు దాదాపు రూ. 10 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. దీనితో పాటు, విజేతకు ఉచిత హోటల్ వసతి, ఆహారం లభిస్తుంది. మిస్ వరల్డ్ 2024గా ఎంపికైన క్రిస్టినా పిస్కోవాకు ఇంకా అనేక ప్రయోజనాలు అందనున్నాయి. అయితే ఆ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
అందంతో పాటు చదువులోనూ టాప్
క్రిస్టినా పిస్కోవా లా అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో రెండు డిగ్రీలు పూర్తి చేశారు. ఆమె అంతర్జాతీయ మోడల్ కూడా. క్రిస్టినా పిస్కో ఫౌండేషన్‌ను కూడా స్థాపించింది. టాంజానియాలో పేద పిల్లల కోసం ఆంగ్ల పాఠశాలను కూడా ప్రారంభించింది. ఫ్లూట్, వయోలిన్ వాయించడం అంటే క్రిస్టినాకు ఎంతో ఇష్టం. ఆర్ట్ అకాడమీలో తొమ్మిది సంవత్సరాల శిక్షణ తీసుకున్న ఆమెకు సంగీతం, కళపై మక్కున ఎక్కువ. పిల్లలకు మంచి విద్యను అందించే లక్ష్యంతో వాలంటీర్‌గా పనిచేసింది. విద్య అనేది ఆమె అభిరుచి అయినందున, చెక్ రిపబ్లిక్‌లో తన స్వంత ఫౌండేషన్‌ను తెరవాలని నిర్ణయించుకుంది. ఈ ఫౌండేషన్ పిల్లలకు మాత్రమే కాకుండా వృద్ధులకు, మానసిక వికలాంగులకు కూడా విద్యను అందిస్తోంది.