Loading...
Amitabh Bachchan: 5 కోట్ల మంది ఫాలోవర్లు నా బలం.. మీడియా కథనంపై అమితాబ్‌ తీవ్ర ఆగ్రహం!
5 కోట్ల మంది ఫాలోవర్లు నా బలం.. మీడియా కథనంపై అమితాబ్‌ తీవ్ర ఆగ్రహం!

Amitabh Bachchan: 5 కోట్ల మంది ఫాలోవర్లు నా బలం.. మీడియా కథనంపై అమితాబ్‌ తీవ్ర ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఓ మీడియా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ తాను చేసిన పోస్టును వక్రీకరించి, యుద్ధ హెచ్చరికగా చిత్రీకరించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై సోమవారం ఆయన 'ఎక్స్‌' వేదికగా ఓ పోస్టు పెట్టారు. అమితాబ్ బచ్చన్ అక్టోబరు 29న 'హాథీ ఘోడా పల్కీ.. జై కన్హయ్య లాల్ కీ..' అంటూ శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ ఓ పోస్టు చేశారు. దీనిపై ఓ మీడియా సంస్థ వార్త ప్రచురించింది. అమితాబ్ తన ప్రత్యర్థులకు సవాల్ విసిరారని, ''మీరు ఏనుగులు, గుర్రాలు తీసుకురండి.. మేము మా ఆయుధాలతో పోరాడతామంటూ హెచ్చరించారని ఆ కథనంలో పేర్కొంది. ఈ కథనంపై అమితాబ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

వివరాలు

100 రెట్లు ఎక్కువ స్పందిస్తారు

శ్రీకృష్ణుడి కీర్తనను అవమానించడమే కాకుండా.. తన వ్యాఖ్యలను వక్రీకరించి, ప్రత్యర్థులను హెచ్చరిస్తున్నట్లుగా వార్తను ప్రచురించారని ఆయన మండిపడ్డారు.

తాను చేసిన పోస్టుకు తప్పుగా అర్థం చెబుతూ కథనాన్ని ప్రచురించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో సదరు మీడియా సంస్థకు అమితాబ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ''జాగ్రత్తగా వినండి. నాకు 5 కోట్లకు పైగా ఫాలోవర్ల బలం ఉంది.

నేను పిలుపునిస్తే.. వారిలో 10 శాతం మంది మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు నా మాటలను ఎంత ఎక్కువగా వక్రీకరిస్తే.. దానికి 100 రెట్లు ఎక్కువగా వారు స్పందిస్తారని హెచ్చరించారు.

వివరాలు

బుల్లెట్‌ప్రూఫ్‌ అద్దం వెనుక నుంచి అభిమానులకు అభివాదం

అమితాబ్ బచ్చన్ ప్రతి ఆదివారం ముంబయిలోని తన నివాసం 'జల్సా' వద్దకు వచ్చే అభిమానులకు అభివాదం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలో నవంబరు 1న కూడా ఆయన అభిమానులను పలకరించారు. అయితే ఈసారి బుల్లెట్‌ప్రూఫ్‌ అద్దం వెనుక నిల్చొని అభిమానులకు అభివాదం చేయడం చర్చనీయాంశమైంది.

ఇటీవల నటుడు టైగర్ ష్రాఫ్‌పై ఓ ముఠా కాల్పులకు పాల్పడిన నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అమితాబ్ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

సాధారణంగా అభిమానులను నేరుగా పలకరించే ఆయన.. ఈసారి బుల్లెట్‌ప్రూఫ్‌ రక్షణ మధ్య కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ADVERTISEMENT