Srikanth Odela: 'నా రక్తం, ఆత్మ ధారపోస్తున్నా'… నాని కోసం దర్శకుడి ఎమోషనల్ పోస్టు
ఈ వార్తాకథనం ఏంటి
న్యాచురల్ స్టార్ నాని నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా 'దసరా' ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగభరితమైన పోస్టును సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా సెట్స్‌లో నానితో తనకున్న అనుబంధాన్ని శ్రీకాంత్ ఆ పోస్టులో వివరించారు. "నాని అన్నా, నువ్వు ప్రతిసారి 'నీ ఇష్టం శ్రీకాంత్' అన్నప్పుడల్లా, అది నాకు 'నేను నిన్ను నమ్ముతున్నాను శ్రీకాంత్' అన్నట్లుగా అనిపిస్తుంది. ఆ నమ్మకమే నన్ను ప్రతి సెకను భయపెడుతుంటుంది. అందుకే 'ది ప్యారడైజ్' కోసం నా రక్తం, ఆత్మను ధారపోస్తున్నానంటూ శ్రీకాంత్ పేర్కొన్నారు.
Details
నమ్మకాన్ని ఒమ్ము చేయను
సినిమా మేకింగ్ విషయంలో నానికున్న ప్రతి రూల్‌ను తాను బ్రేక్ చేశానని కూడా ఆయన వెల్లడించారు. నాని వర్కింగ్ డేస్ ప్యాటర్న్, రిలీజ్ డేట్ స్ట్రీక్, ఆయన వర్కింగ్ స్టైల్, ఇలా అనేక విషయాలను మార్చేశానని చెప్పారు. అయితే తాను ప్రతిసారి రూల్స్ బ్రేక్ చేసినప్పుడల్లా, నాని తనను కొత్తగా తీర్చిదిద్దాడని భావోద్వేగంగా రాశారు. ఈ సినిమా కోసం నిన్ను జడలు వేసుకోమన్నా, చేతిపై పచ్చబొట్టు వేయించుకోమన్నా, ఎన్ని రీటేక్స్ తీసుకుని ఇబ్బంది పెట్టినా నువ్వు కేవలం 'ఓకే రా నీ ఇష్టం' అని మాత్రమే అన్నావు. నువ్వు నా మీద ఉంచినంత నమ్మకాన్ని ఎవరూ ఉంచలేదని పేర్కొన్నారు.
Details
'ది ప్యారడైజ్'పై ఇప్పటికే భారీ అంచనాలు
'దసరా' చిత్రంలో నాని పోషించిన 'ధరణి' పాత్రను గుర్తు చేస్తూ, "నన్ను నమ్మిన నా ధరణికి, మళ్లీ నమ్ముతున్న నా 'జడల్'కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ రుణం జీవితాంతం తీర్చుకోలేను అన్నా" అంటూ శ్రీకాంత్ తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. 'దసరా' వంటి మాస్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.