Nag Ashwin: కల్కి 2898 ఏడీకి జాతీయ అవార్డులు.. నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన 'కల్కి 2898 AD' చిత్రానికి రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఈ గుర్తింపుపై దర్శకుడు నాగ్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో సరికొత్త ప్రపంచాన్ని నిర్మించడంతోపాటు.. అందులోని కథ, పాత్రలను ప్రేక్షకులకు భావోద్వేగపరంగా చేరువ చేయగలిగామని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాకు 'బెస్ట్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్', 'బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్' విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఇంత విస్తృతమైన ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం సాంకేతికంగా, నిర్వహణ పరంగా ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని చెప్పారు.
వివరాలు
ప్రొడక్షన్ డిజైన్ అవార్డుపై ప్రత్యేకంగా స్పందన
''భారీ స్థాయిలో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. అయితే దాన్ని కేవలం విజువల్స్ వరకే పరిమితం చేయకుండా.. ప్రేక్షకులకు భావోద్వేగంగా దగ్గర చేయగలిగాం. కోట్లాది మంది ఈ సినిమాతో అనుబంధం ఏర్పరచుకున్నారు. ఇందులోని ప్రపంచాన్ని, పాత్రలను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ఈ రెండు అంశాలను సాధించగలిగినందుకు మాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది'' అని నాగ్ అశ్విన్ తెలిపారు.
ప్రొడక్షన్ డిజైన్‌కు వచ్చిన జాతీయ అవార్డుపైనా ఆయన స్పందించారు.
ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయమైన ప్రపంచాన్ని అనుకరించే బదులు.. 'కల్కి 2898 ఏడీ'కి ప్రత్యేకమైన విజువల్ ఐడెంటిటీని అందించేందుకు చిత్రబృందం కృషి చేసిందని వివరించారు.
సినిమాలో చూపించిన ప్రపంచం, దాని నిర్మాణం ప్రత్యేకంగా కనిపించేలా ప్రతి అంశాన్ని రూపొందించినట్లు చెప్పారు.
వివరాలు
భారతీయ మూలాలతో కొత్త ప్రపంచాల సృష్టికి ప్రాధాన్యమిస్తామని వెల్లడి
భవిష్యత్తులోనూ భారతీయ సంస్కృతి, మూలాలకు అనుసంధానమైన సరికొత్త ప్రపంచాలను సృష్టించడమే తమ లక్ష్యమని నాగ్ అశ్విన్ వెల్లడించారు.
భారతీయ కథలను కొత్త తరహా విజువల్ ప్రపంచాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
నాగ్ అశ్విన్‌కు జాతీయ అవార్డులు రావడం ఇదే తొలిసారి కాదు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన 'మహానటి' చిత్రానికి 2018లో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది.
ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' ద్వారా మరో రెండు జాతీయ పురస్కారాలు ఆయన ఖాతాలో చేరాయి.