100వ సినిమాకు అదిరిపోయే ప్లాన్ తో నాగార్జున, గాడ్ ఫాదర్ డైరెక్టర్ కు ఛాన్స్?
ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడకు దర్శకుడిగా అవకాశమిస్తున్నాడని నాగార్జున గురించి వార్తలు వచ్చాయి. ప్రసన్న కుమార్ చెప్పిన పాయింట్ నాగార్జునకు నచ్చిందనీ, పూర్తి కథను సిద్ధం చేయమని నాగార్జున చెప్పాడని అన్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమా నాగార్జున కెరీర్ లో 99వ చిత్రంగా నిలుస్తుంది. తాజాగా నాగార్జున 100వ సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్ర దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో నాగార్జున 100వ సినిమా ఉండనుందని చెప్పుకుంటున్నారు. ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ, మోహన్ రాజాతో సినిమా చేయడానికి నాగార్జున ఆసక్తిగా ఉన్నారట. ఆల్రెడీ మోహన్ రాజా కథ వినిపించినట్లు, అందులో ఇద్దరు హీరోలు ఉంటారని అంటున్నారు.
అప్పుడు నాగ చైతన్య, ఈసారి అఖిల్
ఇద్దరు హీరోలున్న మల్టీస్టారర్ మూవీ ఐతే బాగుంటుందని నాగార్జున భావిస్తున్నారట. ఒక హీరో పాత్రలో నాగార్జున చేస్తే, మరో హీరోగా అక్కినేని అఖిల్ ని తీసుకోవాలని చూస్తున్నారట. ఇదే నిజమైతే అఖిల్ తో కలిసి చేస్తున్న మొదటి సినిమా ఇదే అవుతుంది. మనం సినిమాలో చిన్న పాత్ర తప్ప నాగార్జున తో కలిసి పనిచేయలేదు అఖిల్. నాగా చైతన్య మాత్రం మనం సినిమాలో, బంగార్రాజు సినిమాలో తండ్రితో కలిసి తెరను పంచుకున్నాడు. మరి మరోమారు అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఒకే తెరమీద ప్రేక్షకులు కనిపిస్తారా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే, అక్కినేని అఖిల్, ఏజెంట్ మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.