Loading...
Neha Sharma : డీప్‌ఫేక్ వీడియోలపై నేహా శర్మ ఫైర్.. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కున్నా వదిలిపెట్టను!
డీప్‌ఫేక్ వీడియోలపై నేహా శర్మ ఫైర్.. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కున్నా వదిలిపెట్టను!

Neha Sharma : డీప్‌ఫేక్ వీడియోలపై నేహా శర్మ ఫైర్.. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కున్నా వదిలిపెట్టను!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 17, 2026
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సృష్టిస్తున్న 'డీప్‌ఫేక్‌' వీడియోలు చిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగిస్తున్నాయి. కృత్రిమ మేధ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ కొందరు ఆకతాయిలు హీరోయిన్ల ముఖాలను ఉపయోగించి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్నారు. తాజాగా ఈ డీప్‌ఫేక్‌ బారిన టాలీవుడ్‌ 'చిరుత' బ్యూటీ, బాలీవుడ్‌ నటి నేహా శర్మ పడినట్లు వెల్లడైంది. అయితే ఈ ఘటనపై మౌనంగా ఉండకుండా ఆమె తీవ్రంగా స్పందించారు. తన పేరుతో, ముఖంతో నకిలీ వీడియోలు సృష్టిస్తున్న సైబర్‌ నేరగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ సోషల్‌ మీడియాలో సంచలన పోస్ట్‌ పెట్టారు.

వివరాలు

నా అనుమతి లేకుండా వీడియోలు సృష్టించొద్దు.. నేహా శర్మ హెచ్చరిక

తన అనుమతి లేకుండా ముఖాన్ని ఉపయోగించి ఏఐ సాయంతో వీడియోలు, ఫొటోలు సృష్టిస్తున్న వారిపై నేహా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన వ్యక్తిత్వానికి, గౌరవానికి భంగం కలిగించేలా రూపొందించిన నకిలీ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆమె ఘాటుగా స్పందిస్తూ.. ''నా ముఖాన్ని ఉపయోగించి సృష్టించిన నకిలీ కంటెంట్‌ మొత్తాన్ని వెంటనే తొలగించండి.

నా పరువుకు భంగం కలిగించేలా ఇలాంటి వీడియోలు రూపొందించడం, వాటిని ఇతరులకు పంపించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.

దీనికి నా సమ్మతి అస్సలు లేదు. తక్షణమే ఆ చెత్తనంతా సోషల్‌ మీడియా నుంచి తొలగించండి. ఇది అధికారిక హెచ్చరిక'' అని పేర్కొన్నారు.

వివరాలు

ఫేక్‌ అకౌంట్ల వెనుక దాక్కున్నా తప్పించుకోలేరు!

నకిలీ ఖాతాల వెనుక దాక్కొని ఇలాంటి చర్యలకు పాల్పడేవారు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరని నేహా శర్మ హెచ్చరించారు.

తన గుర్తింపును ఉపయోగించి ఏఐ వీడియోలను రూపొందించినా, ఎడిట్‌ చేసినా లేదా వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినా సంబంధిత వ్యక్తులందరిపైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

'ఫేక్‌ అకౌంట్ల వెనుక దాక్కున్నా సరే.. చట్టం నుంచి, శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు.

నా గుర్తింపును ఉపయోగించి ఇలాంటి ఏఐ వీడియోలను సృష్టించినా, ఎడిట్‌ చేసినా లేదా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినా ప్రతి ఒక్కరిపైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఏఐ టెక్నాలజీ, నకిలీ ఖాతాలు మిమ్మల్ని కాపాడతాయని భ్రమపడకండి.

ADVERTISEMENT

వివరాలు

ఏఐ దుర్వినియోగంపై సినీ పరిశ్రమలో ఆందోళన

పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వెంటనే ఆ కంటెంట్‌ను తొలగించండి. మిమ్మల్ని హెచ్చరించానంటూ నేహా శర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఏఐ సాంకేతికత అందుబాటులోకి రావడంతో డీప్‌ఫేక్‌ వీడియోలను రూపొందించడం సులభమవుతోంది.

దీంతో సినీ ప్రముఖుల ముఖాలను దుర్వినియోగం చేస్తూ నకిలీ చిత్రాలు, వీడియోలు సృష్టించే ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

వ్యక్తుల అనుమతి లేకుండా వారి ముఖాలను ఉపయోగించి అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందించడం, ప్రచారం చేయడం వారి గౌరవానికి, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే అంశం.

తనపై జరుగుతున్న ఈ డీప్‌ఫేక్‌ దాడికి వ్యతిరేకంగా నేహా శర్మ గట్టిగా స్పందించడంతో పాటు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ADVERTISEMENT