Loading...
Newton's 3rd law Review: 'న్యూటన్స్ థర్డ్ లా' మూవీ రివ్యూ.. సుమంత్ కర్మ సిద్ధాంతం ప్రేక్షకులను మెప్పించిందా?
'న్యూటన్స్ థర్డ్ లా' మూవీ రివ్యూ.. సుమంత్ కర్మ సిద్ధాంతం ప్రేక్షకులను మెప్పించిందా?

Newton's 3rd law Review: 'న్యూటన్స్ థర్డ్ లా' మూవీ రివ్యూ.. సుమంత్ కర్మ సిద్ధాంతం ప్రేక్షకులను మెప్పించిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

కథ: డేవిడ్ కిషోర్ (శ్రీనివాస్ అవసరాల) ఒకప్పుడు పెద్ద వ్యాపారవేత్త. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా తన అసలు గుర్తింపును మార్చుకుని, చాలాకాలంగా ఓ గ్యాంగ్‌టక్‌లో గడుపుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అతని చేతికి ఒక కొరియర్ వస్తుంది. అందులో 'న్యూటన్స్ థర్డ్ లా'అనే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలోని కథ తన గత జీవితాన్ని పోలి ఉండటంతో డేవిడ్ ఒక్కసారిగా భయపడతాడు. పుస్తకాన్ని చదవడం ప్రారంభించగానే కథ 1999 కాలానికి వెళ్తుంది. రోడ్డు ప్రమాదంలో జ్యోతి (నేహా పఠాన్) ప్రాణాలు కోల్పోతుంది. ఆ వెంటనే వినయ్ (త్రినాథ్ వర్మ) అనే యువకుడు ఓ భవనం పైనుంచి కిందపడిపోయి మరణిస్తాడు.

వివరాలు

స్పెషల్ ఆఫీసర్ పాత్రలో సుమంత్

ఈ అనుమానాస్పద మరణాల వెనుక నిజాన్ని వెలికితీసేందుకు స్పెషల్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్) రంగంలోకి దిగుతాడు.

పోస్టుమార్టం నివేదికలో వినయ్ తలలో బుల్లెట్ ఉన్నట్లు తేలడంతో, అతని తండ్రి గంగాధర్ (రవి వర్మ)పై అనుమానం వ్యక్తం చేసి, ఆధారాలు సేకరించి జైలుకు పంపిస్తాడు.

అయితే అక్కడితో కథ ముగియదు. ఈ దర్యాప్తులోకి అనూహ్యంగా మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్, క్రిమినల్ మెర్క్యురీ (జగపతిబాబు) ప్రవేశిస్తాడు.

కాలేజ్ విద్యార్థి అయిన వినయ్ మరణానికి మెర్క్యురీకి సంబంధం ఏమిటి? డేవిడ్ తన గుర్తింపును ఎందుకు మార్చుకున్నాడు? మధ్యలో కార్తీక్ పాత్ర ఎలా వచ్చింది?

వివరాలు

కథనం

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అయితే అలాంటి కథల్లో దర్యాప్తు ఎంత ఉత్కంఠగా సాగుతుందన్నదే సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది.

దర్శకుడు రాజేష్ కర్ణ ఈ సినిమాకు ఎంచుకున్న 'కర్మ సిద్ధాంతం' అనే ప్రధాన అంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

అలాగే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా కథతో ముడిపెట్టిన తీరు ప్రశంసనీయం.

అయితే ఈ మంచి ఆలోచనను తెరపై ప్రభావవంతంగా ఆవిష్కరించడంలో దర్శకుడు పూర్తిగా విజయవంతం కాలేకపోయాడు.

మొదటి భాగం దాదాపు తల్లిదండ్రుల విచారణ చుట్టూనే సాగుతుంది. దర్యాప్తులో వేగం లేకపోవడంతో కొన్నిచోట్ల ప్రేక్షకులకు బోర్ అనిపించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

త్రినాథ్ వర్మ సన్నివేశాలు అద్భుతం

త్రినాథ్ వర్మకు సంబంధించిన సన్నివేశాలు బాగుంటాయి. స్క్రీన్‌ప్లే గతం-వర్తమానం మధ్య ప్రయాణించినా ఎక్కడా గందరగోళం ఉండదు.

అయితే స్క్రీన్‌ప్లేను మరింత కట్టుదిట్టంగా రాసి ఉంటే సినిమా స్థాయి ఇంకో మెట్టు ఎక్కేదనే భావన కలుగుతుంది.

ఇంటర్వెల్ నాటికి అసలు నిందితుడు దొరికిపోయాడనిపించినా, అసలు కథ మాత్రం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. రెండో భాగంలో మరెన్నో చిక్కుముడులను విప్పే ప్రయత్నం చేశారు.

అయితే ఇక్కడే దర్శకుడు తడబడ్డాడు. వరుసగా కొత్త అంశాలు, ఊహించని ట్విస్టులను తీసుకురావడంతో కథ కాస్త గందరగోళంగా మారుతుంది.

ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తాయి.

ADVERTISEMENT

వివరాలు

నటీనటులు

ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా ఉండాల్సిన సినిమా... ల్యాగ్, గజిబిజి కథనంతో యావరేజ్ థ్రిల్లర్‌గా మిగిలిపోతుంది. అయితే "ప్రతి యాక్షన్‌కు సమానమైన, వ్యతిరేక రియాక్షన్ ఉంటుంది" అనే న్యూటన్ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టి చెప్పిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది.

స్పెషల్ ఆఫీసర్ వాసుదేవ్ పాత్రలో సుమంత్ హుందాగా నటించాడు.

తన హావభావాలతో ఆకట్టుకున్నప్పటికీ, తెరపై కనిపించే సమయం తక్కువగా అనిపిస్తుంది. డేవిడ్ పాత్రలో శ్రీనివాస్ అవసరాల మరోసారి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా ఆయన పాత్రకు ఇచ్చిన ట్విస్టులు బాగున్నాయి.

మెర్క్యురీ పాత్రలో జగపతిబాబు తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఆయన నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. వినయ్ పాత్రలో త్రినాథ్ వర్మ అద్భుతంగా నటించాడు.

వివరాలు

సాంకేతిక విభాగం

ఈ సినిమాకు ప్రధాన బలం సింజిత్ అందించిన నేపథ్య సంగీతం. పాటలు సాధారణంగానే ఉన్నప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్‌కు మంచి బలం ఇచ్చింది. వేదవ్యాస్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా పాతకాలపు వింటేజ్ ఫీల్‌ను సినిమా మొత్తం కొనసాగించిన తీరు బాగుంది. ఎడిటర్ అనిల్ రెండో భాగంలో ఇంకాస్త కత్తెర వేయాల్సింది.

సినిమా నిడివి తక్కువే అయినప్పటికీ, సెకండాఫ్‌లో ల్యాగ్ స్పష్టంగా కనిపిస్తుంది.

దర్శకుడు రాజేష్ కర్ణ ఎంచుకున్న కథ, కాన్సెప్ట్ బలంగానే ఉన్నప్పటికీ, దానిని మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో వెనుకబడ్డారు. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

వివరాలు

తీర్పు

'న్యూటన్స్ థర్డ్ లా' మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. కర్మ సిద్ధాంతాన్ని కథలో మేళవించిన విధానం ఆకట్టుకుంటుంది.

కానీ నెమ్మదిగా సాగే కథనం, సెకండాఫ్‌లో గందరగోళంగా మారే ట్విస్టులు, ల్యాగ్ కారణంగా సినిమా ఆశించిన స్థాయికి చేరుకోలేదు.

అయినప్పటికీ విభిన్న కాన్సెప్ట్‌లను ఇష్టపడే థ్రిల్లర్ ప్రేక్షకులకు ఒకసారి చూడదగ్గ చిత్రంగా చెప్పొచ్చు.

పంచ్ లైన్

ఓవరాల్‌గా 'న్యూటన్స్ థర్డ్ లా'.. యాక్షన్, రియాక్షన్, కర్మ సిద్ధాంతంతో వచ్చిన యావరేజ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.

ADVERTISEMENT