Pawan Kalyan : 'కటానా'తో పవన్ కొత్త దశ.. మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో కీలక మలుపు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అనగానే కేవలం ఒక హీరో అనే నిర్వచనం సరిపోదు. ఆ పేరు స్వయంగా ఒక ప్రభంజనంలా మారింది. ఆయన నటనలో కనిపించే వేగం, స్టైల్‌లో ఉండే ప్రత్యేక మేనరిజమ్స్‌కు అసంఖ్యాకమైన అభిమానులున్నారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడా మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలోనే పవన్ కళ్యాణ్ ఒక 'కొత్త దశ'ను ప్రారంభించబోతున్నారన్న సంకేతాలు అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నాయి. చాలా కాలం విరామం తర్వాత జనవరి 7, 2026న ఈ కొత్త అధ్యాయం మొదలుకాబోతున్నట్లు తాజాగా విడుదలైన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
Details
మార్షల్ ఆర్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదలైన ఈ పోస్టర్‌లో జపాన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక ఎర్రటి సూర్యుడు, దాని ముందు నిటారుగా నిలిచిన కటానా కత్తి దర్శనమిస్తున్నాయి. ఇది కేవలం సినిమా ప్రకటన మాత్రమే కాదని, యుద్ధ విద్యల పట్ల తనకున్న ఆసక్తిని మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారన్న స్పష్టమైన సంకేతంగా అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ ఆరంభం నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వచ్చారు. ఆయన కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడం తెలిసిందే. 'తమ్ముడు', 'బద్రి', 'జానీ' వంటి సినిమాల్లో ఆయన ప్రదర్శించిన ఫైట్ సీక్వెన్స్‌లు అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Details
ఓ శిక్షణ కేంద్ర ఏర్పాటుకు సన్మాహాలు
అప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త ఫైట్ కంపోజిషన్లను ఆయనే స్వయంగా డిజైన్ చేసుకోవడం విశేషం. మార్షల్ ఆర్ట్స్‌ను కేవలం నేర్చుకోవడమే కాకుండా, తన సినిమాల కోసం నిరంతరం సాధన చేయడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకతగా నిలిచింది. తాజాగా పోస్టర్‌లో కనిపించిన '07-01-2026' తేదీ ఆయన అభిమానుల్లో ఎన్నో ఆశలు, అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ కొత్త దశ అనేది అసలు దేనిని సూచిస్తుందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకునే యువత కోసం ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారని వార్తలు వచ్చాయి. బహుశా ఆ దిశగానే ఇప్పుడు అడుగులు పడుతున్నాయేమోనని అభిమానులు ఊహిస్తున్నారు.