Peddi: నార్త్ అమెరికాలో 'పెద్ది' హవా.. రిలీజ్ ముందే సంచలనం సృష్టిస్తున్న రామ్ చరణ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో 'పెద్ది'పై ఓవర్సీస్ మార్కెట్‌లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన 'హెల్లాళ్ళల్లో' ఐటెం సాంగ్‌తో పాటు ఇతర పాటలు యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతుండగా.. ఇప్పుడు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఈ సినిమా బాక్సాఫీస్ వేటను ముందుగానే ప్రారంభించింది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలకు సంబంధించిన ప్రీ-సేల్స్ ఇప్పటికే 5 లక్షల డాలర్ల ($500K) మార్క్‌ను దాటేసి కొత్త రికార్డు సృష్టించాయి.
వివరాలు
వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరే అవకాశం
ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్‌ను బట్టి చూస్తే.. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం సులభంగా వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌కు దర్శకుడు బుచ్చిబాబు సానా బ్రాండ్ కూడా తోడవడంతో యూఎస్ ఆడియన్స్ ఈ సినిమాపై భారీ ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్లుగా మారి సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి.
వివరాలు
జూన్ 4న రిలీజ్
ముఖ్యంగా శ్రుతి హాసన్ కనిపించిన 'హెల్లాళ్ళల్లో' మాస్ ఆంథెమ్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొంది.