శంకరాభరణం సినిమాకు ఎడిటర్ గా చేసిన జిజి కృష్ణారావు కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తారకరత్న నిష్క్రమణం దిగమింగముందే మరో ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు జిజి కృష్ణారావు కన్నుమూశారు.
బెంగళూరులోని తన నివాసంలో ఈరోజు ఉదయం శ్వాస విడిచారు జి జి కృష్ణారావు.
గత కొన్ని రోజులుగా వయసుకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న జిజి కృష్ణారావు, 87 ఏళ్ల వయసులో ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు.
దాదాపు 300కు పైగా సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన జిజి కృష్ణారావు, దిగ్గజ దర్శకులైన దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్, బాపు, జంధ్యాల సినిమాలకు పనిచేశారు. ఒక్క తెలుగులోనే కాదు హిందీ సినిమాలకు కూడా ఆయన పని చేశారు.
తన కెరీర్లో ఇప్పటివరకు మూడు సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు.
శంకరాభరణం
శంకరాభరణం సినిమాకు ఎడిటర్ గా పని చేసిన కృష్ణారావు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా చెప్పుకునే శంకరాభరణం సినిమాకు జిజి కృష్ణరావు ఎడిటర్ గా పనిచేశారు. అంతేకాదు కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం, సప్తపది, శుభసంకల్పం, శుభలేఖ, సీతామహాలక్ష్మి మొదలగు చిత్రాలకు కూడా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
ఇంకా దాసరి నారాయణ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జంధ్యాల దర్శకత్వంలోని నాలుగు స్తంభాలాట, బాపు డైరెక్షన్లోని శ్రీరామరాజ్యం చిత్రాలకు పని చేశారు.
హిందీ సినిమాలైనా మిలన్ సుర్ సంఘం చిత్రాలతో తన నైపుణ్యాన్ని చూపించారు జిజి కృష్ణారావు. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ విజయ మాధవి ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలతో ఆయన ఎక్కువగా సినిమాలు చేశారు.
జిజి కృష్ణారావు మృతి పై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.