Rajendra Prasad : 'షష్టిపూర్తి' వేడుకల్లో రాజేంద్రప్రసాద్.. 37 ఏళ్ల తర్వాత జోడి కట్టిన జంట
టాలీవుడ్ నవ్వుల మహారాజు, అలనాటి నటుడు రాజేంద్రప్రసాద్ 'షష్టిపూర్తి' సంబురాల్లో మునిగారు. ఈ మేరకు ఫోటోలు షేర్ చేశారు. 'షష్టిపూర్తి' సినిమాలో నటిస్తున్న రాజేంద్రప్రసాద్, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్'లో సినిమాలోని పలు సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శించారు. ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ భార్యగా నటీ అర్చన నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి 'లేడీస్ టైలర్' సినిమాలో నటించారు. ఆనాడు ఈ జోడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగలిగింది. సుమారు 37 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ పాత స్క్రీన్ జోడి. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ షష్టిపూర్తి కథాంశంతో నడవనుంది.
హీరో హీరోయిన్లుగా రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షసింగ్
సినిమా కథ రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరగనుంది. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షసింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ఆచ్యుత్ కుమార్, వై విజయ కీలక పాత్రల్లో అలరించనున్నారు. రూపేష్‌కుమార్ చౌదరి నిర్మాతగా, పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. మరో హైలెట్ ఏంటంటే, ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బాణీలను సమకూర్చుతున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్, 4 దశాబ్దాలుగా నటనా ప్రావీణ్యంతో వినోదం పంచుతూనే ఉన్నారు. ఇటీవలే ఆయన ఓటిటి రంగంలోకీ అడుగెట్టారు. సేనాపతి, కృష్ణరామ ఓటిటి కంటెంట్'తో నేటి ఆధునిక ఆడియన్స్'ను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్ తాజాగా 'షష్టిపూర్తి' సెలబ్రేషన్స్'తో ప్రేక్షకులను ఆనందింపజేసేందుకు సయాయత్తం అవుతున్నారు.