ఆస్కార్ వేదిక నాటు నాటు నాటు పాటకు స్టెప్పులు వేద్దామనుకున్నా కుదర్లేదంటూ కారణం చెప్పిన రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట పర్ఫార్మెన్స్ జరిగే సందర్భంలో, ఆర్ఆర్ఆర్ హీరోలు డ్యాన్సులు వేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. ప్రస్తుతం ఈ విషయం మీద రామ్ చరణ్ మాట్లాడాడు. ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయాలని రామ్ చరణ్ అనుకున్నాడట. అందుకు వందశాతం సిద్ధంగా ఉన్నాడట. కాకపోతే ఎవరూ పిలవకపోవడంతో అది కుదరలేదని అన్నాడు. అయితే ఇప్పుడు ఆ విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని, ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాటకు స్టెప్పులు వేసిన బృందం, చాలా బాగా చేసిందని అన్నాడు.
ప్రాక్టీస్ లేని కారణంగా స్టెప్పులు వేయలేకపోయిన ఆర్ఆర్ఆర్ హీరోలు
తెలుగు పాటకు ఆస్కార్ వేదిక మీద వేరే వాళ్ళు స్టెప్పులు వేస్తుంటే చాలా బాగా అనిపించిందనీ, ఆ క్షణంలో అది తమ పాట కాదని, ఇండియా పాటకు వాళ్ళు స్టెప్పులు వేసినట్లుగా అనిపించిందనీ అన్నాడు రామ్ చరణ్. ఆస్కార్ వేదిక మీద రామ్ చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులు వేస్తే బాగుంటుందని చాలామంది అనుకున్నారు. ప్రాక్టీసు లేని కారణంగా నాటు నాటు పాటకు స్టెప్పులు వేయలేక పోతున్నారంటూ ఆ టైమ్ లో వార్తలు వచ్చాయి. గత నెల మార్చ్ 13న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ఉత్తమ పాటకు అవార్డు అందుకుని భారతీయ సినిమా చరిత్రలో ఆస్కార్ గెలుచుకున్న తొలిపాటగా గుర్తింపు పొందింది నాటు నాటు పాట.