chhaava: 'ఛావా'లో నటించే ఛాన్స్‌ను ఎందుకు వదులుకున్నానంటే: రణ్‌దీప్ హుడా
ఈ వార్తాకథనం ఏంటి
'ఛావా' సినిమాలో నటించే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నానో నటుడు రణదీప్ హూడా తాజాగా వెల్లడించారు. ఛావా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్ర కోసం మొదట తననే సంప్రదించారని ఆయన తెలిపారు. అయితే ఆ సమయంలో ఉన్న పరిస్థితుల కారణంగా ఆ పాత్రను అంగీకరించలేకపోయానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
వివరాలు
అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా..
రణ్‌దీప్ మాట్లాడుతూ.. తాను అప్పట్లో స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాకు సిద్ధమవుతున్నానని చెప్పారు. ఆ పాత్ర కోసం శరీరాకృతిలో కూడా మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని, అందువల్ల ఔరంగజేబు పాత్రకు తాను సరిపోనని భావించానన్నారు. అదేవిధంగా 'ఛావా' కథ మతపరమైన అంశాల నేపథ్యంలో సాగుతుందనే అభిప్రాయం తనకు కలిగిందని పేర్కొన్నారు. అదే సమయంలో 'స్వతంత్ర్య వీర్ సావర్కర్' సినిమాకు సంబంధించిన కోర్టు వ్యవహారాలు కూడా ఎదుర్కొంటున్నానని చెప్పారు. ఈ కారణాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే 'ఛావా'లో నటించకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.
వివరాలు
రణ్‌దీప్ వదులుకున్న ఔరంగజేబు పాత్ర..
రణ్‌దీప్ వదులుకున్న ఔరంగజేబు పాత్రను తరువాత అక్షయ్ ఖన్నా పోషించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. సినిమాలో విక్కీ కౌశల్ తన నటనతో విశేష ప్రశంసలు అందుకోగా, శంభాజీ భార్య పాత్రలో రష్మిక మందన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.800 కోట్ల వసూళ్లు సాధించడం ప్రత్యేకంగా నిలిచింది.