Renu Desai: వీధి కుక్కల తీర్పుపై రేణు దేశాయ్ తీవ్ర వ్యాఖ్యలు.. జడ్జిపై సంచలన ఆరోపణ
ఈ వార్తాకథనం ఏంటి
జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా గుర్తింపు పొందిన సినీ నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వీధి కుక్కల హత్యలకు సంబంధించిన అంశంలో బహిరంగంగానే సవాల్ విసిరారు. ఈ విషయంలో ఆమె ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. వీధి కుక్కలను వ్యతిరేకిస్తూ వాటిని చంపాలని చూస్తున్న వారికి 'పిచ్చి పట్టింది' అంటూ రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఆమె అత్యంత కటువుగా స్పందించారు.
Details
న్యాయవ్యవస్థపై తీవ్ర విమర్శలు
"మొత్తం న్యాయం అనేది ఒక జోక్‌గా మారిపోయింది. దీనికి నేనే సాక్ష్యం అంటూ న్యాయవ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ తీర్పును ఇచ్చిన న్యాయమూర్తికి కుక్కలపై ఏదైనా వ్యక్తిగత ద్వేషం ఉండి ఉండవచ్చని ఆమె ఆరోపించారు. ఇది మానవత్వంతో, దయతో ఇచ్చిన తీర్పు కాదని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టినా నాకు భయం లేదు. ఈ తీర్పును నేను బహిరంగంగానే సవాల్ చేస్తున్నానంటూ రేణు దేశాయ్ తెగేసి చెప్పారు. అదేవిధంగా ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె గుర్తు చేశారు. దోమకాట్ల వల్ల జరిగే మరణాలు ప్రాణాలు కావా? అని ప్రశ్నించారు.
Details
జీవకోటి రక్షణ ఉండాలి
కేవలం కుక్కల వల్ల సంభవించే మరణాలనే లెక్కలోకి తీసుకుని, మూగజీవుల ప్రాణాలు తీయడం ద్వంద్వ నీతి కాదా? అంటూ ఆమె తీవ్రంగా మండిపడ్డారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు సామాన్య జీవకోటి రక్షణ కోసం ఉండాలి కానీ, సంహారానికి దారి తీసేలా ఉండకూడదని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న వీధి కుక్కల ఊచకోత వెనుక ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు మూగజీవులను బలి చేస్తున్నారని ఆమె విమర్శించారు. న్యాయవ్యవస్థపై రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ, న్యాయ వర్గాల్లో వేడెక్కిన చర్చలకు దారి తీస్తున్నాయి.