Loading...
Hanuman Ansh Movie review: రివ్యూ: 'హనుమాన్ అంశ్'.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిందా?
రివ్యూ: 'హనుమాన్ అంశ్'.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిందా?

Hanuman Ansh Movie review: రివ్యూ: 'హనుమాన్ అంశ్'.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2026
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాంటి భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం 'హనుమాన్ అంశ్'. దాదాపు రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే సుమారు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ సినిమా కథేంటి? తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది? అనేది తెలుసుకుందాం.

వివరాలు

కథేంటంటే?

దేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగే కథ ఇది. లక్ష్మీ నారాయణ శర్మ (శోభినవ్ సత్య) తన 13 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోతాడు. చనిపోయిన తల్లిని ఎలాగైనా తిరిగి చేరుకోవాలని అతడు తపిస్తాడు.

శ్రీరాముడే తనను తల్లితో మళ్లీ కలపగలడని బలంగా నమ్ముతాడు. తల్లి నేర్పించిన ధ్యాన సాధనతో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు.

ఈ క్రమంలో హనుమాన్ చాలీసా నుంచి స్ఫూర్తి పొందిన లక్ష్మీ నారాయణ.. హనుమంతుడి ద్వారా శ్రీరాముడిని చేరుకోవచ్చని విశ్వసిస్తాడు.

ఆ నమ్మకంతోనే తన ఆధ్యాత్మిక అన్వేషణను కొనసాగిస్తాడు. మరి శ్రీరాముడిని వెతుకుతూ హనుమంతుడి భక్తి మార్గంలో సాగిన లక్ష్మీ నారాయణ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది?

వివరాలు

బోధన ఆధారంగా కథ రూపొందరణ

ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయి 13 ఏళ్ల వయసులోనే ఇంటిని వదిలి వెళ్లిన ఆ బాలుడు.. తనకు ఎదురైన అడ్డంకులను ఎలా అధిగమించాడు? నిస్వార్థ ప్రేమతో సమాజానికి సేవ చేస్తూ నీమ్ కరోలి బాబాగా ఎలా మారాడు?

ఈ ప్రయాణంలో ఆయన చేసిన అద్భుతాలేంటి? అనే అంశాల చుట్టూ సినిమా కథ సాగుతుంది.

1900 నుంచి 1973 వరకు జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమంతుడి భక్తుడు నీమ్ కరోలి బాబా (మహారాజ్‌జీ) జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ADVERTISEMENT

వివరాలు

ఎలా ఉందంటే?

దర్శకుడు విశాల్ చతుర్వేది సాధారణ కమర్షియల్ సినిమాల్లో కనిపించే హంగులకు దూరంగా.. ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించేలా కథను సహజంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

ఈ సినిమా థియేటర్‌లో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. ఓ చక్కటి ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొన్న భావన కలుగుతుంది.

నాస్తికుడైన డాక్టర్ రామానంద్ భోంస్లే దృక్కోణం నుంచి కథను ప్రారంభించిన తీరు, బాబా బాల్యాన్ని పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటాయి.

తల్లి మరణించిన తర్వాత ఆ బాలుడు సాగించిన ఆధ్యాత్మిక అన్వేషణ, ఆ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా చూపించారు.

రాజ్‌కోట్‌లోని వైష్ణవ ఆలయంలో పరిచయమయ్యే వృద్ధ మహంత్ పాత్ర.. లక్ష్మీ నారాయణ జీవితాన్ని కీలక మలుపు తిప్పుతుంది.

ADVERTISEMENT

వివరాలు

ఆసక్తికరంగా కథ

ఆ మహంత్ పెట్టిన పరీక్షలో బాలుడు ఎలా నెగ్గాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. లక్ష్మీ నారాయణ నీమ్ కరోలిలో అడుగుపెట్టిన తర్వాత కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

ఇంటర్వెల్‌కు ముందు వచ్చే భూగర్భ గుహ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. విష సర్పాల మధ్య శివుడిని తలపించేలా బాబా దర్శనమిచ్చే సన్నివేశాన్ని ఆసక్తికరంగా చిత్రీకరించారు.

ద్వితీయార్ధం ప్రధానంగా నీమ్ కరోలి బాబా చేసిన లీలలు, ఆయన ఆధ్యాత్మిక సాధన, సమాజ సేవ చుట్టూ సాగుతుంది.

అయితే ప్రథమార్ధంతో పోలిస్తే సెకండాఫ్ కథనం కొంత నెమ్మదించిన భావన కలుగుతుంది.

రైలులో బ్రిటిష్ అధికారి ప్రదర్శించే అహంకార ధోరణి, దానికి బాబా తనదైన భక్తి మార్గంలో బుద్ధి చెప్పే సన్నివేశం ద్వితీయార్ధంలో మంచి విజిల్ మూమెంట్‌గా నిలుస్తుంది.

వివరాలు

ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి

అలాగే పార్వతి భర్తను పాము కాటు నుంచి కాపాడే తీరు, ఆమె ఇంట్లో బాబా భోజనం చేసే సన్నివేశాలు భావోద్వేగాలను బలంగా పండిస్తాయి.

బాబా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాల్సి రావడం, తన అసలు లక్ష్యాన్ని భార్యకు వివరించి కుటుంబ బంధాల నుంచి బయటకు రావడం వంటి సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి.

ఈ కథకు కొనసాగింపు ఉండవచ్చనే సంకేతాలు ఇస్తూనే.. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కథను ముగించిన తీరు ప్రేక్షకులకు మరో కొత్త అనుభూతిని అందిస్తుంది.

వివరాలు

ఎవరెలా చేశారంటే?

నీమ్ కరోలి బాబా పాత్రలో శోభినవ్ సత్య ఎంతో సహజంగా ఒదిగిపోయారు. నటుడిగా ఇది ఆయన తొలి చిత్రమైనప్పటికీ.. ఎక్కడా కొత్త నటుడనే భావన కలగనీయకుండా పరిణతితో కూడిన అభినయాన్ని ప్రదర్శించారు.

ఎలాంటి నాటకీయతకు తావివ్వకుండా ప్రశాంతమైన చిరునవ్వు, స్వచ్ఛమైన హావభావాలతో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడిగా, నాస్తికుడైన డాక్టర్ రామానంద్ భోంస్లే పాత్రలో చందన్ ఆనంద్ నటన మెప్పిస్తుంది.

విహాన్ షెడ్గే, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతి ఒక్కరూ సహజమైన నటనతో కథకు బలాన్ని చేకూర్చారు.

వివరాలు

సాంకేతిక విభాగాల పనితీరు ఎలా ఉందంటే?

దర్శకుడు విశాల్ చతుర్వేది నీమ్ కరోలి బాబా జీవితాన్ని నిజాయతీగా తెరపై ఆవిష్కరించగలిగారు. బాబా చేసిన లీలలను కూడా ఎక్కడా అతిశయోక్తిగా చూపకుండా.. వాస్తవికతకు దగ్గరగా తెరకెక్కించేందుకు ప్రయత్నించారు.

సాధు సుశీల్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాలో భక్తిభావాన్ని మరింత పెంచాయి. సినిమా ఆద్యంతం 'సీతారామ్' నామస్మరణ థియేటర్‌లో మార్మోగుతుంది.

ఇది ప్రేక్షకులను ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్తుంది. పరిమిత బడ్జెట్‌తో రూపొందినప్పటికీ.. స్వాతంత్య్రానికి పూర్వం నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ విభాగాలు మంచి ప్రతిభను కనబరిచాయి.

అప్పటి కాలాన్ని ప్రతిబింబించే దృశ్యాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

వివరాలు

బలాలు

ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే కథ

శోభినవ్ సత్య సహజమైన నటన

ఆకట్టుకునే సంగీతం, నేపథ్య సంగీతం

స్వాతంత్య్ర పూర్వ వాతావరణాన్ని ప్రతిబింబించే విజువల్స్

బలహీనతలు

ద్వితీయార్ధంలో నెమ్మదిగా సాగే కథనం

చివరిగా..

హనుమాన్ అంశ్.. మనసుకు ప్రశాంతతనిచ్చే ఓ ఆధ్యాత్మిక ప్రయాణం! ఆధ్యాత్మిక కథలు, భక్తిభావంతో కూడిన సినిమాలను ఇష్టపడేవారికి 'హనుమాన్ అంశ్' మంచి అనుభూతిని అందిస్తుంది.

నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన ఆధ్యాత్మిక సాధన, సమాజ సేవను సహజంగా చూపించిన తీరు ఈ చిత్రానికి ప్రధాన బలం. అయితే నెమ్మదిగా సాగే కథనం కొందరికి కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు.

ADVERTISEMENT