srinivasa mangapuram Review: రివ్యూ: 'శ్రీనివాస మంగాపురం'.. జయకృష్ణ అరంగేట్రం సక్సెస్ అయ్యిందా?
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయమయ్యాడు. దివంగత నటుడు రమేష్ కుమారుడు, కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ చేతుల మీదుగా ఆయన సినీ అరంగేట్రం జరగడం విశేషం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. మహేష్ బాబు తొలి చిత్రం 'రాజకుమారుడు' విడుదలైన జూలై 30నే జయకృష్ణ తొలి సినిమా 'శ్రీనివాస మంగాపురం' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉంది? కొత్త హీరో జయకృష్ణ నటన ఎలా ఉంది? తెలుసుకుందాం.
వివరాలు
కథ ఏమిటి?
కథానాయకుడు శ్రీను (జయకృష్ణ ఘట్టమనేని) తిరుపతికి వచ్చిన వెంటనే మంగ (రషా థడానీ)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.
అయితే మంగ సాధారణ యువతి కాదు. తిరుపతిలో ప్రభావశీలుడైన పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) కుమార్తె. అలాంటి కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం అంత సులభం కాదు.
అయినప్పటికీ శ్రీను వెనక్కి తగ్గకుండా ఆమె వెంట తిరుగుతుంటాడు. కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది.
ప్రేమగా మారబోతున్న సమయంలో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంటుంది. అయినా కూడా "మంగ నాదే" అనే నమ్మకంతో శ్రీను ముందుకు సాగుతాడు.
అసలు మంగ కూడా శ్రీనును ప్రేమించిందా? శ్రీను తిరుపతికి ఎందుకు వచ్చాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
వివరాలు
సినిమా ఎలా ఉంది?
'శ్రీనివాస మంగాపురం' కథ కొత్తదేమీ కాదు. ఇప్పటికే ఎన్నో ప్రేమకథల్లో చూసిన కథనే మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ తరహా సినిమాల్లో కథ కంటే నేపథ్యం, ప్రేమ జంట మధ్య కెమిస్ట్రీ, సన్నివేశాల రూపకల్పన, పాటలు, భావోద్వేగాలే ప్రధాన బలం అవుతాయి.
దర్శకుడు అజయ్ భూపతి కూడా అదే దిశగా ప్రయాణించారు. తిరుపతి నేపథ్యం, హీరో-హీరోయిన్ల జోడీ, పాటలు సినిమాకు కొంత తాజాదనం తీసుకొచ్చాయి.
కానీ భావోద్వేగాలు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను కదిలించలేకపోయాయి. మొదటి భాగం పూర్తిగా ఒక ఫార్ములా ప్రేమకథ తరహాలో సాగుతుంది.
హీరో హీరోయిన్‌ను చూడటం, వెంటనే పాట రావడం, ఆమెతో పరిచయం పెరగడం, మరో పాట, మధ్యలో ఒక ఫైట్... ఇలా సన్నివేశాలు ఊహించినట్టుగానే సాగుతాయి.
వివరాలు
తన
"మంగ నాదే... మంగ నాదే..." అంటూ హీరో పదే పదే చెప్పడం కొన్నిసార్లు పరిణతి లేని ప్రేమకథను చూస్తున్న భావన కలిగిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌కు ముందు కథానాయిక మనసులో సహజంగా ప్రేమ పుట్టే సన్నివేశాలు పెద్దగా కనిపించవు.
అయితే ఇంటర్వెల్‌కు ముందు, తర్వాత వచ్చే కీలక సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి.
భావోద్వేగాల పరంగా ప్రభావం చూపిన భాగం కూడా అదే.
ఆ సన్నివేశాల తర్వాతే హీరో "మంగ నాదే" అని ఎందుకు అంటున్నాడో ప్రేక్షకుడికి అర్థమవుతుంది.
ఆ తర్వాత మళ్లీ కథ మామూలు ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది. పెద్దిరెడ్డి, వెంకటప్పయ్య నాయుడు వర్గాలు, వారి ప్రత్యర్థులు తెరపై కనిపించినా.. ఆ సంఘర్షణ కథపై పెద్దగా ప్రభావం చూపినట్లు అనిపించదు.
వివరాలు
నటీనటుల ప్రదర్శన ఎలా ఉంది?
ఇది జయకృష్ణ తొలి సినిమానే అయినప్పటికీ, చాలా సన్నివేశాల్లో మంచి పరిణతి ఉన్న నటనను ప్రదర్శించాడు.
సినిమా కోసం ఆయన బాగా సిద్ధమైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కథానాయిక రషా థడానీ తన అందంతో ఆకట్టుకుంది.
ముఖ్యంగా పాటల్లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. వెంకటప్పయ్య నాయుడు పాత్రలో మోహన్ బాబు తనదైన శైలిలో నటించారు.
అయితే ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. బ్రహ్మాజీ పాత్రకు 'బాలు' అనే పేరు పెట్టడం, వీకే నరేశ్‌ను 'స్వతంత్రబాబు' పాత్రలో చూపించిన తీరు, కొన్ని సన్నివేశాల రూపకల్పన అంతగా హుందాగా అనిపించదు.
అజయ్, వాసుకి తదితర నటులు తమ పాత్రల పరిధిలో బాగా నటించారు.
వివరాలు
సాంకేతిక విభాగం
ఛాయాగ్రాహకుడు జయకృష్ణ గుమ్మడి అందించిన విజువల్స్ సినిమాకు ప్రధాన బలం. ప్రేమకథకు తగ్గట్టుగా అందమైన ఫ్రేమ్‌లను తెరకెక్కించారు.
జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా కొన్ని కీలక సన్నివేశాలకు బలం చేకూర్చింది. మిగిలిన సాంకేతిక విభాగాలు తమ పనిని సమర్థంగా నిర్వహించాయి.
దర్శకుడు అజయ్ భూపతి గత చిత్రాల్లో కనిపించిన బలమైన కథ, పాత్రలు, సాంకేతిక హంగులు ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో కనిపించలేదు.
ముఖ్యంగా రచనలో బలం లేకపోవడం సినిమాకు ప్రధాన మైనస్‌గా మారింది. అయితే నిర్మాణ విలువలు మాత్రం మంచి స్థాయిలో ఉన్నాయి.
వివరాలు
ప్లస్ పాయింట్లు
హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా థడానీ నటన
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్
పాటలు, విజువల్స్
మైనస్ పాయింట్లు
ముందే ఊహించగలిగే కథ, కథనం
కొత్తదనం లేని సన్నివేశాలు
భావోద్వేగాల ప్రభావం తక్కువగా ఉండటం
తుది తీర్పు
'శ్రీనివాస మంగాపురం' పూర్తిగా కొత్త కథతో ఆకట్టుకునే సినిమా కాకపోయినా, కొత్త జంట జయకృష్ణ-రషా థడానీ కెమిస్ట్రీ, ఫ్లాష్‌బ్యాక్ ఎమోషన్స్, పాటల కోసం ఒకసారి చూడొచ్చు.
హీరోగా జయకృష్ణకు ఇది మంచి ఆరంభంగా చెప్పొచ్చు. అయితే బలమైన కథ, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వకపోవచ్చు.
చివరిగా: 'శ్రీనివాస మంగాపురం'... శ్రీను-మంగ జోడీ కోసం ఒకసారి చూడొచ్చు!