ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్
తమిళ హీరో ధనుష్, "సార్" సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. బంజారా అనే హుక్ లైన్ తో ఉన్న ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాసారు. జానపదంలా కనిపిస్తున్న ఈ పాట, జీవితం గురించి తెలుపుతోంది. ఇల్లే నాదనీ, వాకిలి నాదేనంటే పక్కున నవ్వుతదీ భూతల్లీ, పడవే నాదనీ, అలలు నావేనంటే పడిపడి నవ్వుతవీ సంద్రాలే అంటూ మొదలైన ఈ పాట, ఆసాంతం జీవిత సత్యాల్ని తెలుపుతోంది. ఎండాకాలంలో వేడిరుచే చూడాలే, వానాకాలంలో నీటిమువ్వై ఆడాలే, చందమామొచ్చే వెన్నెలకాలంలో చలితో ఇష్టంగా దోస్తీ చెయ్యాలే అంటూ అన్ని కాలాలను ఆస్వాదించాలని చెప్పారు.
బంజారా లిరికల్ వీడియోలో కనిపించిన మ్యూజిక్ డైరెక్టర్, సింగర్
తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదివరకు ఈ సినిమాలోంచి రిలీజైన మాస్టారు మాస్టారు పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా కనిపిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు నాంగవంశీ ఎస్, సౌజన్య నిర్మిస్తున్నారు. విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే ఒక టీచర్ కథే ఈ సార్ సినిమా అని టీజర్ చూస్తే అర్థమయ్యింది. మరి తెలుగులో ధనుష్ చేస్తున్న మొదటి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.