సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా కళామతల్లి మరో పెద్ద దిక్కును కోల్పోయింది. యముడి పాత్రలు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈ రోజు ఉదయం కన్నుమూసారు.
ఫిలిమ్ నగర్ లోని తన నివాసంలో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు సంవత్సరం నుండి ఆయన మంచం మీదే ఉన్నారు.
కైకాల మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అభిమానుల కోసం ఆయన పార్థివ దేహాన్ని ఫిలిమ్ ఛాంబర్ కి తీసుకురానున్నారని సమాచారం.
1959లో సిపాయి కూతురు చిత్రంతో తెలుగు సినిమాల్లో అడుగు పెట్టారు కైకాల. మొదట్లో విలన్ పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.
కైకాల సత్యనారాయణ
పౌరాణిక పాత్రలతో ఎనలేని గుర్తింపు
పౌరాణిక సినిమాల్లోని పాత్రలతో కైకాలకు మంచి గుర్తింపు వచ్చింది. యముడిగా ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటికీ కూడా యముడి వేషం వేయాలంటే కైకాలనే అని చెప్పుకుంటారు.
మొదట్లో ఎన్టీఆర్ పోలికలతో ఉన్నారని ఎన్టీఆర్ కు డూప్ గా కూడా నటించారు కైకాల. దాదాపుగా 60 ఏళ్ళు సినిమాల్లో కనిపించిన కైకాల, 750 కి పైగా సినిమాల్లో నటించారు.
తన నట ప్రయణంలో ఎన్నో మైలురాళ్ళను అందుకున్నారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు కైకాలను వరించింది.
రాజకీయాల్లోనూ కైకాలకు ప్రవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుండి మచిలీపట్నం నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నికయ్యారు. నటుడిగా మహర్షి చిత్రంలో ఆఖరి సారిగా కనిపించారు.