Sowcar Janaki: షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ సినీ నటి షావుకారు జానకి (Sowcar Janaki) అస్వస్థతకు గురయ్యారు. 95 ఏళ్ల వయసున్న ఆమె కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి షావుకారు జానకి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు ఆమెను ఐసీయూకు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
వివరాలు
త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానుల ఆకాంక్ష
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సుదీర్ఘకాలం నటిగా కొనసాగిన షావుకారు జానకి తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
1949లో విడుదలైన 'షావుకారు' సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు.
ఆ సినిమా పేరునే ఆమె తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.
ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
షావుకారు జానకి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.