ఇంటివాడు కాబోతున్న హీరో శర్వానంద్, ఎంగేజ్ మెంట్ ఎప్పుడంటే
టాలీవుడ్ లో పెళ్ళి బాజాలు వరుసగా వినిపించనున్నాయి. యంగ్ హీరోలు అందరూ ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలెక్కబోతున్నారు. మొన్నటికి మొన్న నాగశౌర్య వివాహం జరిగింది. రీసెంట్ గా సీనియర్ హీరో నరేష్, పెళ్ళి ప్రకటన చేసాడు. ప్రస్తుతం మరో యంగ్ హీరో శర్వానంద్ పెళ్ళి చేసుకోబోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడు శర్వానంద్. వధువు, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుందని సమాచారం. జనవరి 26వ తేదీన నిశ్చితార్థం ఉండనుందని, ఆ తర్వాత వేసవిలో పెళ్ళి ఉండనుందని అంటున్నారు. పెళ్ళి వేడుక హైదరాబాద్ లో జరగనుందని వినిపిస్తోంది.
పెళ్ళి కూతురు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు
ఐతే ప్రస్తుతం అందరూ పెళ్ళి కూతురు ఎవరనే విషయంపై ఆసక్తిగా ఉన్నారు. టీడీపీ నుండి ఎమ్మేల్యేగా గెలిచి శ్రీకాళహాస్తి నియోజకవర్గానికి సేవలందించిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలితో శర్వానంద్ వివాహం నిశ్చయమైంది. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కూతురు పద్మకు జన్మించిన కుమార్తెతో శర్వానంద్ పెళ్ళి జరగనుంది. పద్మ కూతురు మేనమామ బొజ్జల సుధీర్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. మొత్తానికి శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల ఆహాలోని అన్ స్టాపబుల్ షోలోకి వచ్చిన శర్వానంద్, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావ్ అని బాలయ్య అడిగితే ప్రభాస్ తర్వాత అని సమాధానం చెప్పాడు. ఆ మాటను బ్రేక్ చేసి పెళ్ళి సిద్ధమైపోయాడు శర్వానంద్. 2022లో ఒకే ఒక జీవితం సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.