LOADING...
Vijay Devarakonda : రివ్యూలు-రేటింగ్స్‌ వల్ల నిద్రలేని రాత్రులు.. విజయ్ దేవరకొండ భావోద్వేగ వ్యాఖ్యలు
రివ్యూలు-రేటింగ్స్‌ వల్ల నిద్రలేని రాత్రులు.. విజయ్ దేవరకొండ భావోద్వేగ వ్యాఖ్యలు

Vijay Devarakonda : రివ్యూలు-రేటింగ్స్‌ వల్ల నిద్రలేని రాత్రులు.. విజయ్ దేవరకొండ భావోద్వేగ వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2026
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు టాలీవుడ్‌లో యూత్ ఐకాన్‌గా దూసుకెళ్లిన హీరో విజయ్ దేవరకొండ, ఇటీవలి కాలంలో వరుస పరాజయాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడమే కాకుండా, ప్రతి కొత్త సినిమా విడుదలకు ముందే నెగిటివ్ ప్రచారం, స్టార్ రేటింగ్స్ పేరుతో ముందస్తు తీర్పులు తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన గతంలోనే పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి.

Details

రివ్యూలపై కొంతకాలంగా వివాదం

తెలుగు సినిమా రంగంలో ఆన్‌లైన్ రివ్యూలు, స్టార్ రేటింగ్స్ వ్యవస్థపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. సినిమా విడుదలైన క్షణాల్లోనే రేటింగ్స్ వెలువడటం, వాటి ఆధారంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. అయితే ఈ విధానం కొన్నిసార్లు సినిమాల భవితవ్యాన్ని దెబ్బతీస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం జరగడం వల్ల నిర్మాతలు, దర్శకులు ఆర్థికంగా నష్టపోతున్నారని పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Details

సినిమా రంగానికే చెందిన వారే ఇలా చేస్తున్నారు

ఈ క్రమంలో గతంలో మంచు విష్ణు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు అనుమతి లభించింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర బృందం కూడా కోర్టును ఆశ్రయించడంతో, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్స్‌లో రివ్యూలు, స్టార్ రేటింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామాలపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఈ వార్త చూసినప్పుడు ఒకవైపు సంతోషం... మరోవైపు బాధ కలిగిందని వ్యాఖ్యానించారు. ఎంతోమంది కృషి, పెట్టుబడిని కాపాడేందుకు ఇది కొంతవరకు ఉపయోగపడుతుందన్న ఆశ ఉందని, కానీ సినిమా రంగానికి చెందిన వారే ఇలాంటి సమస్యలకు కారణమవుతుండటం బాధాకరమని అన్నారు.

Advertisement

Details

గతంలో నా మాటకు విలువ ఇవ్వలేదు

'లివ్ అండ్ లెట్ లివ్' అనే ఆలోచన పరిశ్రమలో ఎక్కడ మాయమైందని ప్రశ్నించారు. 'డియర్ కామ్రేడ్' రోజుల నుంచే వ్యవస్థీకృతంగా జరుగుతున్న నెగిటివ్ దాడులను తాను గమనించానని, అప్పట్లో తన మాటకు విలువ ఇవ్వలేదని విజయ్ గుర్తు చేసుకున్నారు. మంచి సినిమా అయితే ఎవరూ ఆపలేరు అన్నారు. కానీ నాతో పని చేసిన నిర్మాతలు, దర్శకులు తర్వాత ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నారంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. అయితే ఇది పూర్తి పరిష్కారం కాదని, గుడ్డిలో మెల్లలా మార్పు మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల విడుదలైన తన సినిమా 'కింగ్‌డమ్' కూడా నెగిటివ్ ప్రచారం, ట్రోలింగ్‌ను ఎదుర్కొందని విజయ్ దేవరకొండ పరోక్షంగా పేర్కొన్నారు.

Advertisement