'The Crew': టబు, కరీనా కపూర్, క్రితి సనన్ నటిస్తున్న సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్స్ అయిన టబు, కరీనా కపూర్ ఖాన్, క్రితిసనన్ కలిసి నటిస్తున్న 'ద క్రూ(The Crew)' సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. రాజేష్ క్రిష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 2024మార్చ్ 22న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. రియా కపూర్, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దిలిజిత్ దోసాంజ్, కపిల్ శర్మ కనిపించనున్నారు. గతంలో రియా, ఏక్తా నిర్మించిన వీరే ది వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్ కనిపించింది. ఆ తర్వాత 'ద క్రూ' సినిమాతో మరోసారి రియా, ఏక్తా నిర్మిస్తున్న సినిమాలో కనిపిస్తోంది కరీనా కపూర్. 'వీరే ది వెడ్డింగ్' సినిమాకు పనిచేసిన నిధి మెహ్రా, మెహుల్ సూరి 'ద క్రూ' సినిమాకు రచనా విభాగంలో పనిచేస్తున్నారు.
ద క్రూ కథ ఏంటంటే?
ముగ్గురు కష్టపడి పనిచేసే మహిళలు, అబద్ధాల వలయంలో ఇరుక్కుని ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నదే కథ. విమానయాన(ఎయిర్ లైన్) ఇండస్ట్రీ నేపథ్యంలో సినిమా ఉంటుందని సమాచారం. అందుకు తగినట్టుగానే సినిమా టైటిల్‌ని 'ద క్రూ' అని పెట్టారు. ఈ సినిమా గురించి మాట్లాడిన నిర్మాత ఏక్తా కపూర్, ముగ్గురు స్టార్స్‌తో సినిమా నిర్మించడం ఎక్సైటింగ్‌గా ఉందని పేర్కొన్నారు. ద క్రూ నటీమణుల ఇతర సినిమాలను చూస్తే, అజయ్ దేవగణ్ నటిస్తున్న 'ఔరాన్ మే కహా ధమ్ తా' సినిమాలో టబు నటిస్తుంది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఇంకా పేరు పెట్టని నెట్ ఫ్లిక్స్ థ్రిల్లర్‌లో కరీనా కపూర్ ఖాన్ నటిస్తుంది.