Loading...
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు లీగల్ నోటీసులు.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు!
దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు లీగల్ నోటీసులు.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు!

Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు లీగల్ నోటీసులు.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 27, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల కేటాయింపు వ్యవస్థ కొందరి చేతుల్లోనే ఉందంటూ ఓ చిన్న సినిమా దర్శకుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిత్రాలకు థియేటర్లు దక్కకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ 'ఓ అందాల రాక్షసి' దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖ నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులకు ఫైనల్ లీగల్ నోటీసులు పంపడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. థియేటర్ల విషయంలో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబులకు షిరాజ్ మెహది నోటీసులు జారీ చేశారు.

వివరాలు

సినీ పెద్దలకు ప్రశ్న..

ఫిల్మ్ ఛాంబర్‌కు చెందిన ప్రెసిడెంట్ భరత్ భూషణ్, వైస్ ప్రెసిడెంట్ నాగవంశీ, సెక్రటరీ అశోక్ కుమార్, ట్రెజరర్ ప్రసన్న కుమార్‌లకు కూడా ఫైనల్ లీగల్ నోటీసులు పంపారు.

థియేటర్ల కేటాయింపులో వివక్ష చూపుతున్నారనే ఆరోపణలతో PVR INOX అధినేత అజయ్ బిజిలీ, ఆ సంస్థ మేనేజర్ మహేష్‌లను కూడా ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు.

అలాగే ఏసియన్ సినిమాస్ ఎండీ సునీల్ నారంగ్, మేనేజర్ ప్రశాంత్‌లకు సైతం లీగల్ నోటీసులు పంపారు.

తన నోటీసులకు స్పందించకపోతే సంబంధిత వ్యక్తులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని షిరాజ్ మెహది హెచ్చరించారు.

చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సినీ పరిశ్రమలోని పెద్దలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

వివరాలు

చాలా సినిమాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణ..

ఒకేసారి వంద సినిమాలు విడుదలవుతున్న పరిస్థితుల్లో కేవలం రెండు, మూడు చిత్రాలకే థియేటర్లు, ప్రదర్శన అవకాశాలు కల్పిస్తూ.. మిగిలిన 97 సినిమాలకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కావాలనే చిన్న సినిమాల మనుగడను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హోదా, డబ్బు, పలుకుబడి ఉన్నామనే భావనతో కొందరు ఇతరులను గౌరవించడం లేదని షిరాజ్ మెహది మండిపడ్డారు.

కోర్టుకు వెళ్లినా డబ్బు, ప్రభావంతో సమస్య నుంచి బయటపడవచ్చనే ధీమాతో వ్యవహరిస్తున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది కాలంగా తాను వరుసగా ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ చిన్న సినిమాల సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ.. ఇప్పటివరకు కనీసం ఒక్కరైనా ముందుకొచ్చి తన ఆరోపణలకు సమాధానం ఇవ్వలేదని షిరాజ్ అన్నారు.

ADVERTISEMENT

వివరాలు

థియేటర్ల కేటాయింపులో నెలకొన్న సమస్యలు..

ఇంతకాలం ఎవరూ స్పందించకపోవడానికి, ఈ వ్యవస్థ వెనుక ఎవరి మద్దతు ఉందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, తెలుగు సినీ పరిశ్రమలోని థియేటర్ల వ్యవస్థ, చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై షిరాజ్ మెహది నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

తన ఫిర్యాదుతో పాటు సంబంధిత ఆధారాలను కూడా సీఎం కార్యాలయానికి అందించినట్లు ఆయన తెలిపారు.

తన ఫిర్యాదు, ఆధారాలను సీఎం కార్యాలయం స్వీకరించిందని షిరాజ్ మెహది వెల్లడించారు.

ఈ వ్యవహారంపై ప్రభుత్వం త్వరలోనే సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిన్న సినిమాలకు సమాన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, థియేటర్ల కేటాయింపులో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభించాలని ఆయన కోరుతున్నారు.

ADVERTISEMENT