Mufasa: ఓటీటీలో సందడి చేయనున్న 'ముఫాసా: ది లయన్ కింగ్'.. స్ట్రీమింగ్ తేదీ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రాలు ఇప్పుడు సౌత్ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. సూపర్ మేన్, అవతార్, లయన్ కింగ్, ఫ్రోజన్ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించాయి.
ఈ కోవలో వచ్చిన మరో విజేత 'ముఫాసా: ది లయన్ కింగ్'. ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ నిర్మించిన ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రం, గతేడాది విడుదలై పిల్లలతో పాటు పెద్దలను కూడా విశేషంగా ఆకట్టుకుంది.
దర్శకుడు బారీ జెర్కిన్స్ తనకు ఇష్టమైన జానపద కథను సింహాల నేపథ్యంలో రూపొంది అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
సినిమా చూస్తున్నంత సేపు తెరపై నిజమైన సింహాలు, జంతువులు కదలాడుతున్నట్టే అనిపించింది. ఎక్కడా గ్రాఫిక్స్ అనే ఫీలింగ్ రాకుండా అత్యంత నైపుణ్యంతో విజువల్స్ రూపొందించారు.
Details
ఈనెల 18 నుంచి స్ట్రీమింగ్
కథ మొదలవగానే ప్రేక్షకులను ఆ లోకంలోకి తీసుకెళ్లే విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమా పలు భాషల్లో రూపొందగా తెలుగులో 'ముఫాసా' పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు తన గాత్రాన్ని అందించడం మరో విశేషం.
2019లో విడుదలైన 'ది లయన్ కింగ్'కి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, ముఫాసా రాజుగా ఎలా మారాడు? అతని గత చరిత్ర ఏమిటి? అనే అంశాలను ఆసక్తికరంగా చూపించింది.
మంచి కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటిటి వేదికగా ఈ నెల 18 నుంచి అందుబాటులోకి రానుందని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.