పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ సోదాలు జరుగుతున్నాయని సమాచారం. జీఎస్టీ విషయంలో ఆరోపణలు వచ్చినందువల్ల దర్శకుడు సుకుమార్ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తోంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్. సుకుమార్ ఇంట్లో మాత్రమే కాదు, పుష్ప సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలైన రవిశంకర్, నవీన్ యేర్నేని ఇళ్లల్లో ఐటీ సోదాలను నిర్వహిస్తోంది ఆదాయ పన్ను విభాగం. పుష్ప2 చిత్రానికి జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల్లో జిఎస్టీ విషయమై ఆరోపణలు వచ్చిన కారణంగా ఈ సోదాలు జరుగుతున్నాయని చిత్ర వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలోనూ మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు
గతంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల రిలీజ్ కు ముందు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ పై ఐటీ సోదాలు జరిగాయి. మూడు నెలల గ్యాప్ లోనే రెండోసారి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేయడంతో ఈ విషయం అందరికీ ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఐటీ సోదాలు జరుగుతున్నందున పుష్ప2 చిత్ర షూటింగ్ ఆగిపోయినట్లు చెబుతున్నారు. పుష్ప2 చిత్రం దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని అంటున్నారు. ఇందులో దాదాపు సగానికి పైగా ఎక్కువ బడ్జెట్, హీరో, దర్శకులకు రెమ్యునరేషన్ రూపంలో వెళ్ళిపోతుందని అన్నారు. అదలా ఉంచితే, పుష్ప2 డిజిటల్ హక్కులకై దాదాపు 200కోట్ల రూపాయలు వెచ్చించడానికి నెట్ ఫ్లిక్స్ రెడీగా ఉందని గతంలో వార్తలు వచ్చాయి.