Vikram: వివాదంలో సినీనటుడు విక్రమ్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీనటుడు విక్రమ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన లార్ గిబ్బన్ అనే అరుదైన విదేశీ వానరంతో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న అరుదైన జీవజాతుల్లో లార్ గిబ్బన్ కూడా ఒకటి కావడంతో జంతు ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లార్ గిబ్బన్‌ను పెంచుకునేందుకు విక్రమ్ సరైన అనుమతులు తీసుకున్నారా? లేదా? అనే విషయంపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన అధికారులు.. ఈ ప్రాణి మొదట మణిపుర్‌కు చెందిన లైకురామ్ సింగ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
అటవీశాఖ అధికారుల విచారణ..
లైకురామ్ సింగ్ మొత్తం ఎనిమిది లార్ గిబ్బన్ పిల్లలను పెంచుకునేందుకు అనుమతి పొందినట్లు పత్రాల ద్వారా వెల్లడైంది.
ఈ వానరాలు మలేసియాకు చెందినవిగా కూడా ఆ పత్రాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వాటిలో మూడు పిల్లలను ఈరోడ్ జిల్లా పెరుంతురైకి చెందిన కేశనాథన్‌కు అందించారు.
ఆ మూడింటిలో ఒక లార్ గిబ్బన్ ప్రస్తుతం విక్రమ్ సంరక్షణలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో విక్రమ్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆ వీడియోను తొలగించారు.
లార్ గిబ్బన్‌ను ఆయన వద్దకు ఎలా తీసుకొచ్చారు? ఇందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అటవీశాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.