Yash: పిల్లలు 'టాక్సిక్' చూడొద్దు.. యశ్ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్' (Toxic Movie). యశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సినిమా గురించి యశ్ మాట్లాడుతూ.. ఇది పూర్తిగా పెద్దల కోసం రూపొందించిన చిత్రమని స్పష్టం చేశారు. ''పిల్లలు ఈ సినిమా చూడొద్దు. ఇది పెద్దల కోసం మాత్రమే తీశాం. ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా చెబుతున్నాను. పెద్దలకు మంచి, చెడు ఏంటో తెలుసు. ఈ సినిమా నుంచి ఏం తీసుకోవాలనేది వాళ్లే నిర్ణయించుకోగలరు. పెద్దల కోసం ఈ చిత్రాన్ని ఎంతో నిజాయతీగా రూపొందించాం'' అని యశ్ తెలిపారు.
వివరాలు
రెండు పాత్రల మధ్య ప్రేమను ఆవిష్కరించే సన్నివేశాలు..
ఇక సినిమాలోని అశ్లీల సన్నివేశాలపై వస్తున్న విమర్శలపైనా యశ్ స్పందించారు.
ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని అన్నారు. కథ ఒక నిర్దిష్టమైన దిశలో సాగాలంటే.. ప్రతి పాత్రలోని భిన్నమైన కోణాలను చూపించడం ముఖ్యమని చెప్పారు.
''ట్రైలర్, పాటలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటిలో చూపించినవి కేవలం రెండు పాత్రల మధ్య ప్రేమను ఆవిష్కరించే సన్నివేశాలు మాత్రమే. వాటిని అంతవరకే చూడాలి.
గీతూ మోహన్‌దాస్ ఒక దర్శకురాలు. మహిళలకు కూడా తమ భావోద్వేగాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది.
కేవలం పబ్లిసిటీ కోసమే ఆ సన్నివేశాలను పెట్టలేదు. కథలో వాటి ప్రాధాన్యతను బట్టి మాత్రమే చిత్రీకరించాం'' అని యశ్ పేర్కొన్నారు.