రేపే ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు రిలీజ్.. పూర్తి వివరాలివే
ఏపీలో ఈ ఏడాది జరిగిన టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల తేదీ ఖరారైంది. టెన్త్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల తేదీని నేడు విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లండించారు. ఉపాధ్యాయ సంఘాలతో జరుగుతున్న భేటీలో విద్యాశాఖ మంత్రి బోత్స ఫలితాలపై కీలక ప్రకటన చేశారు. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలకు చెక్ పడింది. ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలను రేపు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలో టెన్త్ ఫలితాలను విడుదల చేస్తున్నట్లు మంత్రి బోత్స నారాయణ తెలిపారు.
రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల
ఈ ఏడాది ఏపీలో మొత్తం 6.5 లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలను రాశారు. 3349 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. గత నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరిగాయి. అనంతరం ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకూ ప్రశ్నాపత్రాల మూల్యంకనం ప్రభుత్వం చేపట్టింది. రేపు ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్ సైట్ వివరాలను కూడా రిలీజ్ చేసింది. పదో తరగతి పరీక్షా ఫలితాలు www.results.bse.ap.gov.in వెబ్ సైట్లో ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నారు.