Loading...
Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ పదోన్నతులు.. డీఐజీలుగా ఒకే బ్యాచ్‌కి చెందిన 12 మంది!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ పదోన్నతులు.. డీఐజీలుగా ఒకే బ్యాచ్‌కి చెందిన 12 మంది!

Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ పదోన్నతులు.. డీఐజీలుగా ఒకే బ్యాచ్‌కి చెందిన 12 మంది!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఐపీఎస్‌ అధికారులకు భారీగా పదోన్నతులు దక్కనున్నాయి. 2013 బ్యాచ్‌కు చెందిన రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌లలో 12 మందికి డీఐజీ హోదా లభించనుంది. వచ్చే జనవరి నుంచి వీరంతా డీఐజీలుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఒకే బ్యాచ్‌ నుంచి ఇంతమందికి ఒకేసారి పదోన్నతులు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.

వివరాలు 

12 మంది డీఐజీలు

2013 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన 12 మంది అధికారులు డీఐజీ హోదాకు అర్హత సాధించనున్నారు.

వీరిలో ఒకరు కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తుండగా.. మరొకరు ఇంటర్‌ క్యాడర్‌ డిప్యూటేషన్‌పై ఉన్నారు.

మరో ఇద్దరు శాంతిభద్రతల విభాగంలో డీసీపీలుగా విధులు నిర్వహిస్తున్నారు. నలుగురు ప్రస్తుతం వివిధ జిల్లాలకు ఎస్పీలుగా పనిచేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితమే రాష్ట్ర పోలీస్‌ సర్వీసులకు చెందిన ఎనిమిది మంది ఎస్పీలు పదోన్నతులు పొందారు.

అఖిల భారత సర్వీసుల్లోకి ప్రవేశించి ఐపీఎస్‌ హోదాను సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు మరోవైపు 12 మంది ఐపీఎస్‌లు డీఐజీలుగా పదోన్నతి పొందనుండటం పోలీసు శాఖలో ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

బదిలీలకు ముందే పదోన్నతులు

రాష్ట్రంలో త్వరలోనే ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టనున్న నేపథ్యంలో 12 మంది డీఐజీలుగా పదోన్నతి పొందనుండటం ఆసక్తికరంగా మారింది.

మరో నాలుగు నెలల్లో వీరంతా డీఐజీ హోదాలోకి వెళ్లనున్నారు. దీంతో శాంతిభద్రతల విభాగంలో ఆరు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది.

ఈ ఖాళీల భర్తీతో పాటు ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారుల స్థానచలనాలపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

దీంతో రాబోయే రోజుల్లో పోలీసు శాఖలో బదిలీలు, పోస్టింగులు కీలకంగా మారనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఐపీఎస్‌ల బదిలీలకు కసరత్తు

మరోవైపు జిల్లాల్లో ఎస్పీలుగా, డీసీపీలుగా పనిచేస్తున్న పలువురు ఐపీఎస్‌ అధికారులు ఇప్పటికే రెండేళ్లకు పైగా ఒకే స్థానంలో సర్వీసు పూర్తి చేసుకున్నారు.

దీంతో ఐపీఎస్‌ అధికారుల బదిలీలకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

అయితే ముందుగా ఐపీఎస్‌ అధికారుల పదోన్నతుల ప్రక్రియ పూర్తయ్యే వరకు బదిలీలను చేపట్టకపోవచ్చనే ప్రచారం ఉంది.

పదోన్నతుల అనంతరం బదిలీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత లేదా దేవీ నవరాత్రులు పూర్తయ్యాక ఐపీఎస్‌ అధికారుల బదిలీలు ఉండొచ్చని సమాచారం.

దీంతో పదోన్నతులు, బదిలీలపై పోలీసు శాఖలో ఉత్కంఠ నెలకొంది.

ADVERTISEMENT