ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే?
కార్గో సేవల్లో ఏపీఎస్ఆర్టీసీ దూసుకుపోతోంది. సురక్షితంగా, సకాలంలో, చౌకగా గమ్యస్థానాలకు సరుకులను చేరుస్తుండటంతో కార్గో సేవలకు ఆదరణ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. కార్గో సేవల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో రూ.122 కోట్ల ఆదాయంతో సత్తా చాటింది ఏపీఎస్ఆర్టీసీ. ఆరేళ్ల క్రితం కార్గో వ్యాపారంలోకి ప్రవేశించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ).. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. గతం ఏడాది అనుకున్న లక్ష్యాన్ని సాధించామని, ఈ ఏడాది కూడా రూ.200 కోట్ల లక్ష్యాన్ని అధిగమిస్తామని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
ప్రతి గల్లీలోనూ ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గల్లీలోనూ ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలు అందుతున్నాయని ద్వారకా తిరుమలరావు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాలకు కార్గో సేవలను విస్తరించినట్లు చెప్పారు. ఏపీలో 249 బస్ స్టేషన్లలో పార్శిల్ కౌంటర్లు ప్రారంభించామన్నారు. 525 బుకింగ్ ఏజెంట్లను నియమించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.100కోట్ల వ్యాపారాన్ని చేస్తూ వచ్చిన ఏపీఎస్ఆర్టీసీ కార్గో.. 2022-23లో రూ. 200కోట్ల వ్యాపార ట్రేడ్ మార్క్‌ను చేరుకుంటుందని ద్వారకా తిరుమలరావు ఆశాభావం వ్యక్తం చేశారు.