LOADING...
Andhra Pradesh: వన్యప్రాణుల దాడులకు చెక్‌: ఏపీలో 'హనుమాన్' ప్రాజెక్ట్ ప్రారంభించిన పవన్‌కళ్యాణ్
ప్రజల ప్రాణాలు, పంటలకు రక్షణ: హనుమాన్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం

Andhra Pradesh: వన్యప్రాణుల దాడులకు చెక్‌: ఏపీలో 'హనుమాన్' ప్రాజెక్ట్ ప్రారంభించిన పవన్‌కళ్యాణ్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మానవులు,వన్యప్రాణుల మధ్య ఏర్పడుతున్న సంఘర్షణలను తగ్గించడం లక్ష్యంగా హనుమాన్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించామని ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ అనే అర్థం వచ్చే ఈ ప్రాజెక్ట్ ద్వారా వన్యప్రాణులను సంరక్షించడమే కాకుండా రైతుల పంటలు, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు కూడా రక్షణ కల్పించే విధంగా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించామని ఆయన చెప్పారు. ఎక్కడైనా మానవులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ చోటుచేసుకున్న వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు పరిహారం అందించే లక్ష్యంతో హనుమాన్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

పరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వం చర్యలు

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌ మైదానంలో పవన్‌కల్యాణ్‌ ఈ హనుమాన్‌ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన 100 ప్రత్యేక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. నంతరం పవన్‌కల్యాణ్‌ మాట్లాడారు. ప్రధానాంశాలివీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ-వన్యప్రాణి సంఘర్షణల వల్ల జరిగిన నష్టాలకు వెంటనే పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,107 కేసులు నమోదయ్యాయి. బాధితులకు పరిహారంగా రూ.4 కోట్లు చెల్లించామని తెలిపారు. వన్యప్రాణుల దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు గతంలో రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారని,ఇప్పుడు దానిని రూ.10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు.

వివరాలు 

ఏనుగుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

అలాగే గాయపడిన వారికి ఇచ్చే పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. ఏనుగుల సంచారం వల్ల ఏర్పడుతున్న సమస్యలను తగ్గించేందుకు కర్ణాటక రాష్ట్ర సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఈ కుంకీ ఏనుగుల సహాయంతో ఇప్పటివరకు 8 ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. అలాగే ఏనుగులు లేదా ఇతర వన్యప్రాణులు గ్రామాల వైపు వస్తున్నాయనే విషయాన్ని ముందుగానే గుర్తించేందుకు ఏఐ ఆధారిత హెచ్చరిక వ్యవస్థను అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వివరించారు.

Advertisement

వివరాలు 

వన్యప్రాణి నిర్వహణలో దేశానికి ఏపీ ఆదర్శం

వన్యప్రాణుల సంరక్షణ, ప్రజల భద్రత, శాస్త్రీయ పర్యవేక్షణ,సమగ్ర పరిపాలన అనే నాలుగు ప్రధాన స్తంభాలపై హనుమాన్‌ కార్యక్రమం ఆధారపడి ఉందని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. వన్యప్రాణుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ డా. పీవీ చలపతిరావు, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే హనుమాన్‌ ప్రాజెక్ట్ లక్ష్యాలను వివరించారు. అలాగే అటవీశాఖ సలహాదారులు పి. మల్లికార్జునరావు, పి. నాగేశ్వరరావు, అంకారావు, ఏపీఎంఎస్‌ఐడీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు, అదనపు పీసీసీఎఫ్‌ రాహుల్ పాండే, గుంటూరు జిల్లా కలెక్టర్‌ తమీమ్ అన్సారియా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

వివరాలు 

రెస్క్యూ వాహనాలు,వన్యప్రాణి అంబులెన్సులు

హనుమాన్‌ ప్రాజెక్ట్ కోసం మొత్తం 100 ప్రత్యేక వాహనాలు కేటాయించారు. వాటిలో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలు 7 వన్యప్రాణి అంబులెన్సులు ఉన్నాయి. ఈ వాహనాలకు అనుసంధానంగా విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లూటి ప్రాంతాల్లో నాలుగు వన్యప్రాణి రెస్క్యూ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రతి వాహనంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జంతువైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్లు, పారా వెటర్నేరియన్లు, శిక్షణ పొందిన కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్లు పనిచేసేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.

వివరాలు 

గ్రామస్థాయిలో 'వన్యజీవి రక్షక్‌ (వజ్ర)' వ్యవస్థ

గ్రామస్థాయిలో సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు 'వన్యజీవి రక్షక్‌ (వజ్ర)' అనే ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృందాలకు ప్రత్యేక రెస్క్యూ కిట్లు అందజేస్తారు. పాములు లేదా ఇతర అడవి జంతువుల వల్ల గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

Advertisement