Exam: బాగా చదివినా టెన్షన్‌గా ఉందా? ఇలా చేస్తే పరీక్షల్లో విజయం ఖాయం
ఈ వార్తాకథనం ఏంటి
ఎంత చదివినా మనసులో ఏదో లోటు ఉన్నట్టే అనిపించడం,తెలియని ఆందోళన వెంటాడటం చాలామంది విద్యార్థులకు సహజం. చదివిన ప్రశ్నలే పరీక్షలో వస్తాయా? ఒకవేళ వచ్చాయంటే వాటిని సరైన విధంగా రాయగలమా?అనే సందేహాలు తరచూ కలుగుతాయి. ఈ తరహా భయాలు పరీక్షల సమయంలో సాధారణమే.అయితే వాటిని సమర్థంగా ఎదుర్కొంటేనే విజయం సాధ్యమవుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలంటే తెలివితేటలు మాత్రమే సరిపోవు. ఒత్తిడిని నియంత్రించగలిగినవారే చదివిన విషయాలను స్పష్టంగా రాయగలరు. అదే ఆందోళన ఎక్కువైతే వచ్చినవీ సరిగా రాయలేక ఇబ్బంది పడతారు అందుకే కేవలం చదవడం మాత్రమే కాకుండా, మానసికంగా సిద్ధంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. అందుబాటులో ఉన్న సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ముఖ్యమైన అంశాలను నేర్చుకోవడం, పునశ్చరణ (Revision) చేయడం సులభమవుతుంది.
వివరాలు
కచ్చితమైన ప్రణాళిక
పరీక్షలకు ముందు ప్రతి నిమిషం విలువైనదే. మొదటగా ప్రతి సబ్జెక్టులో ఉన్న సిలబస్‌ను పరిశీలించి, ఇంకా ఏ అంశాలు చదవాల్సి ఉందో ఒక కాగితంపై స్పష్టంగా రాసుకోవాలి. దీంతో చదువు ప్రణాళికను సులభంగా రూపొందించుకోవచ్చు. టైమ్ టేబుల్: పరీక్షల వరకు ఉన్న రోజులను సబ్జెక్టుల ప్రకారం విభజించుకోవాలి. కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించి, సులువైన వాటికి తక్కువ సమయం ఇవ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల చదువు సమతుల్యంగా సాగుతుంది. ప్రాధాన్యం: పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించడం చాలా ఉపయోగకరం. తరచూ అడిగే ముఖ్యమైన ప్రశ్నలను ముందుగా గుర్తించి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత మిగిలిన అంశాలను చదవడం ప్రారంభించాలి.
వివరాలు
ఇలా చదవండి..
గంటల తరబడి పుస్తకం ముందు కూర్చోవడం వల్ల చదువు ఫలితం ఎక్కువగా ఉండకపోవచ్చు. మెదడు చురుకుగా పనిచేయాలంటే మధ్య మధ్యలో విరామాలు అవసరం. సుమారు 25 నిమిషాలు పూర్తిగా ఏకాగ్రతతో చదివి, ఆ తర్వాత 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. ఆ సమయంలో నీళ్లు తాగడం లేదా కొద్దిసేపు నడవడం వల్ల మెదడుకు ఉత్సాహం వస్తుంది. ఈ విధానాన్ని నాలుగు సెషన్లుగా కొనసాగించిన తర్వాత సుమారు 30 నిమిషాల పాటు పెద్ద విరామం తీసుకోవచ్చు. లేదా ఒక గంట చదివి 15 నిమిషాలు విరామం తీసుకోవడం, 90 నిమిషాలు చదివి అరగంట విశ్రాంతి తీసుకోవడం వంటి పద్ధతులను కూడా అనుసరించవచ్చు. మీకు అనుకూలంగా అనిపించే విధానాన్ని ఎంచుకోవడం ఉత్తమం.
వివరాలు
ఇలా చదవండి..
చదివేటప్పుడు ముఖ్యమైన విషయాలను పుస్తకంలో లేదా నోట్స్‌లో గుర్తించుకుని రాయడం మంచిది. దీంతో పరీక్షల ముందు రివిజన్ చేయడం సులభంగా ఉంటుంది. చదివిన విషయాలు గుర్తుండటం కూడా చాలా అవసరం. ప్రతి రోజు పడుకునే ముందు ఆ రోజు చదివిన అంశాలను ఒకసారి పునశ్చరణ చేయాలి. అలాగే వారానికి ఒకసారి చదివినవన్నీ మళ్లీ రివిజన్ చేస్తే అవి ఎక్కువకాలం గుర్తుంటాయి. దీంతో పరీక్ష సమయంలో మర్చిపోవడం అనే సమస్య తగ్గుతుంది.
వివరాలు
వీటిని పాటించండి
పరీక్షలు పూర్తయ్యే వరకు మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. చదువుతున్న సమయంలో ఫోన్‌ను పక్క గదిలో ఉంచడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో విజయానికి సరైన నిద్ర కూడా ఎంతో అవసరం. ప్రతిరోజూ కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవడం వల్ల నేర్చుకున్న విషయాలను మెదడు బాగా గుర్తుంచుకుంటుంది.
వివరాలు
వీటిని పాటించండి
తేలికగా జీర్ణమయ్యే పౌష్టికాహారం తీసుకోవాలి. ఒత్తిడి అనిపించినప్పుడు యోగా, ధ్యానం, నడక, వ్యాయామం చేయడం లేదా సంగీతం వినడం వంటి మీకు నచ్చిన పనిలో ప్రతి రోజు కనీసం అరగంట గడపడం మంచిది. ఆచరణలో పెట్టగలిగే విధంగా ఒక సరైన ప్రణాళిక రూపొందించుకుని, ఆసక్తి, పట్టుదల, క్రమశిక్షణతో దాన్ని అమలు చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు ఒత్తిడి తగ్గి, విజయాన్ని సాధించడం సులభమవుతుంది.