2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా..
2023 జనవరి 1 రాకతో.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టాయి. ఈఏడాది ఏకంగా 9రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే.. ఈ ఎలక్షన్స్‌ను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ మార్చి సీఎం కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌కు.. ఈ ఎన్నికల్లో గెలుపు చాలా కీలకం. ఇక్కడ గెలిస్తేనే.. 2024లో జరగనున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణకు అవకాశం ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం ఉంటుందా? ఉండదా? ఈ ఏడాది డిసెంబర్‌లోనే తేలుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో నవంబర్/డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
మధ్యప్రదేశ్, కర్ణాటకతో పాటు..
త్రిపుర అసెంబ్లీలో 60సీట్లు ఉన్నాయి. ఫిబ్రవరి/మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయా అసెంబ్లీ గడువు మార్చి 15తో ముగుస్తుంది. 60అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరి/మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 60అసెంబ్లీ సీట్లు ఉన్న నాగాలాండ్‌లో ఫిబ్రవరి/మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో 224స్థానాలకు మేలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 90సీట్లు ఉండగా.. నవబంర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 40అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో కూడా నవంబర్‌లోనే ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటికి డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.