Telangana: ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు.. తెలంగాణలో అమలుకు కసరత్తు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద వర్గాలకు చెందిన పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించే అంశంలో ముందడుగు పడుతోంది. విద్యాహక్కు చట్టం నిబంధనలను అమలు చేయడంలో పలు రాష్ట్రాలు దశాబ్దాలు గడుస్తున్నా నిర్లక్ష్యం వహించడంపై ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎన్సీపీసీఆర్) తీరుపైనా అసహనం వ్యక్తం చేసింది. ఈ నెల 27న జరిగే విచారణకు సంఘం ప్రతినిధులు స్వయంగా హాజరై, చట్టం అమలు తీరుపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ దిల్లీకి వెళ్లి ఆ సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు.
వివరాలు
చాలా రాష్ట్రాల్లో అమలు
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ఈ నిబంధనల అమలుపై అధికారులు మరోసారి దృష్టి సారించారు.
విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో నిరుపేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలి.
ఈ నిబంధన అమలుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాలని, ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని న్యాయస్థానం సూచించింది.
అలాగే లాటరీ విధానం ద్వారా సీట్లను కేటాయించాలని, ప్రవేశాల ప్రక్రియలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మార్గదర్శకాల అమలు, పర్యవేక్షణ బాధ్యతలను ఎన్సీపీసీఆర్కు అప్పగించింది.
వివరాలు
గత ఏడాది తూతూమంత్రంగా అమలు
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఇప్పటికే ఈ నిబంధనల అమలుకు అవసరమైన విధివిధానాలను రూపొందించుకొని ముందుకు సాగుతున్నాయి.
అయితే తెలంగాణలో మాత్రం ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో విద్యాహక్కు చట్టం అమలుపై గత ఏడాదే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ సందర్భంగా చట్టాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ న్యాయస్థానానికి హామీ ఇచ్చింది.
అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని 96 ఆవాసాల్లోని పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేలా విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా 2025 జులైలో ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఆ ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈవోలకు) పంపడంతోనే అధికారులు సరిపెట్టారు.
వివరాలు
180 మంది విద్యార్థులే ప్రవేశాలు
క్షేత్రస్థాయిలో విస్తృతంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రవేశాలు పరిమితంగానే జరిగాయి.
ఫలితంగా 2025-26, 2026-27 విద్యా సంవత్సరాల్లో కలిపి కేవలం 180 మంది విద్యార్థులే ప్రవేశాలు పొందినట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం.
తాజాగా సుప్రీంకోర్టు ఈ అంశంపై దృష్టి సారించి, అమలు తీరుపై నివేదిక కోరడంతో అధికారులు మళ్లీ కసరత్తు ప్రారంభించారు.
న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం నిరుపేద పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించే ప్రక్రియను అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.