Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కీలక శుభవార్త అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ 2024 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. జనవరి నెల వేతనంతో కలిపి ఈ పెంపు డీఏను ఫిబ్రవరి 1న చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2023 జూలై 1 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనుంది. 2026 ఏప్రిల్ 30లోపు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు డీఏ బకాయిలను 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Details
ఫిబ్రవరి 1న చెల్లింపు
2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల విషయంలో డీఏ బకాయిల్లో 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేయనున్నారు. మిగిలిన 90 శాతం బకాయిలను 2026 ఫిబ్రవరి 1 నుంచి 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. ఇదే విధంగా పింఛన్‌దారులకు పెరిగిన డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) మొత్తాన్ని ఫిబ్రవరి 1న చెల్లించనున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న డీఆర్ ఎరియర్స్‌ను కూడా ఫిబ్రవరి 1 నుంచి 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు, పింఛన్‌దారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.