Gyanvapi Survey Report: జ్ఞానవాపి మసీదులో55 హిందూ దేవతల విగ్రహాలు- ఏఎస్ఐ సర్వేలో వెల్లడి
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) బృందం చేసిన సర్వేలో సంచలన విషయాలు వెలువడ్డాయి. సర్వేలో 55 హిందూ దేవుళ్ల విగ్రహాలను కనుగొన్నట్లు ఏఎస్ఐ తన నివేదికలో పేర్కొంది. సర్వే నివేదిక ప్రకారం.. జ్ఞానవాపి మసీదు గోడతో సహా అనేక ప్రదేశాలలో 15శివలింగాలు, వివిధ కాలాలకు చెందిన 93 నాణేలను గుర్తించారు. ఈ రాతి విగ్రహాలతో పాటు వివిధ లోహాలు, గృహోపకరణాలకు సంబంధించిన 259 వస్తువులు కనుగొనబడ్డాయి. ఇటీవల, వారణాసి జిల్లా కోర్టు జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించిన సర్వే నివేదికను బహిరంగపరిచింది. జ్ఞానవాపి మసీదు కంటే ముందు ఇక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేదని సర్వే నివేదిక చెబుతోంది. ఈ నిర్మాణం 17వ శతాబ్దంలో ఔరంగజేబు పాలనలో ధ్వంసమైంది.
ఏఎస్ఐ సర్వేలో కీలక ఆధారాలు
సర్వేలో ఏఎస్ఐ బృందం విష్ణు, మకర, ద్వారపాల్, మూర్ఛ పురుష్, మన్నత్ తీర్థతో సహా అనేక విగ్రహాలను గుర్తించింది. ఇది కాకుండా, మొఘల్ కాలం, బ్రిటిష్ పాలనతో సహా ఇతర కాలాలకు చెందిన అనేక నాణేలు కూడా కనుగొనబడ్డాయి. సర్వేలో 23 టెర్రకోట విగ్రహాలను ఏఎస్‌ఐ గుర్తించింది. వీటిలో 2 దేవుళ్ళు, దేవతల విగ్రహాలు, 18 మానవులు, 3 జంతువుల విగ్రహాలు ఉన్నాయి. ఇది కాకుండా, సర్వేలో మొత్తం 113 మెటల్ వస్తువులు, 93 నాణేలు కనుగొనబడ్డాయి. వీటిలో 40 ఈస్ట్ ఇండియా కంపెనీ, 21 విక్టోరియా క్వీన్, మూడు షా ఆలం బాద్షా-II నాణేలు కావడం విశేషం. కృష్ణుడి విగ్రహం ఇసుకరాయితో నిర్మించబడిందని, మధ్యయుగ కాలం నాటిదని నివేదిక పేర్కొంది.
జ్ఞానవాపి వివాదంలో ఇంతకీ ఏం జరిగింది?
ఆగస్ట్, 2021లో మసీదు సమీపంలోని శృంగార్ గౌరీ ఆలయంలో దర్శనం, పూజలకు అనుమతించాలంటూ.. 5మంది మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో శివలింగం కనుకొనబడింది. ముస్లిం పక్షం ఆ శివలింగాన్ని ఫౌంటెన్‌గా అభివర్ణించింది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు మసీదు కాంప్లెక్స్‌ను శాస్త్రీయంగా సర్వే చేసారు. ఇప్పుడు ఆ సర్వే నివేదిక బహిరంగమైంది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన వివాదం శతాబ్దాల నాటిది. కాశీ విశ్వనాథ దేవాలయంలో కొంత భాగాన్ని కూల్చేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మసీదును నిర్మించినట్లు హిందూ పక్షం ఆరోపించింది. మరోవైపు ఆలయానికి మసీదుకు ఎలాంటి సంబంధం లేదని మసీదు కమిటీ చెబుతోంది.