Maharashtra results: 72 గంటల డెడ్‌లైన్.. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వంపై ఉత్కంఠ!
ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26న ముగియనుంది. ఈ నేపథ్యంలో 72 గంటల వ్యవధిలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధిస్తే, ప్రభుత్వ ఏర్పాటు సులభం. అయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడినట్లయితే, రాష్ట్రపతి పాలనకు దారితీయవచ్చు. మహాయుతికి విజయావకాశాలు ఉన్నట్లు కొన్ని పోల్స్ చెబుతున్నాయి. నాలుగు ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశాయి.
145 సీట్ల మెజార్టీ అవసరం
288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 145 సీట్ల మెజారిటీ అవసరం. కానీ కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కీలక సీట్లపై తీవ్ర పోటీ ఉండటంతో ప్రభుత్వం ఏర్పాటు జాప్యం కావచ్చని భావిస్తున్నారు. మహాయుతి లేదా మహావికాస్ అఘాడీ కూటమి మెజారిటీ సాధించినా, ముఖ్యమంత్రి పదవిపై ఏకాభిప్రాయం లేనట్లయితే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మహాయుతిలో దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ షిండే సీఎం రేసులో ఉండగా, ఎంవీఏలో ఉద్ధవ్ ఠాక్రే పేరు ముందు వరుసలో ఉంది. గతంలో కూడా, 2019 ఎన్నికల అనంతరం, సీఎం పదవి తేలకపోవడంతో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది.
రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చే అవకాశం
ఎమ్యెల్యేల సంఖ్య తక్కువగా ఉన్నా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు పొందడం కూటముల పెద్దలకు పెద్ద సవాలుగా మారింది. ఈనెల 26లోగా ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే, రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ 72 గంటలు కీలకం. హంగ్ అసెంబ్లీ వచ్చినా లేదా మెజారిటీ ఉన్నా, కూటముల నేతలు చొరవ చూపించి ప్రభుత్వ ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది.