పీరియడ్స్ పరిశుభ్రత జాతీయ విధానంలో జాప్యంపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక
పాఠశాల బాలికలకు పీరియడ్స్ పరిశుభ్రతపై జాతీయ విధానాన్ని రూపొందించడంపై రాష్ట్రాలు తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాలు రుతుక్రమ పరిశుభ్రత విధానంపై ఆగస్టు 31లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ స్పందించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటి వరకు నాలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే పీరియడ్స్ పరిశుభ్రతపై జాతీయ విధానంపై సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ హెచ్చరిక జారీ చేసింది.
పీరియడ్స్ సమస్యను అపారమైన ప్రాముఖ్యత అంశంగా పేర్కొన్న సుప్రీంకోర్టు
ఇప్పటి వరకు హర్యానా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్‌ల నుంచి మాత్రమే కేంద్రం ప్రభుత్వం నివేదికలను అందుకుందని కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీంకోర్టుకు తెలిపారు. పాఠశాలకు వెళ్లే బాలికల నెలసరి పరిశుభ్రతను నిర్వహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అభిప్రాయాల ఆధారంగా జాతీయ నమూనాను రూపొందించాలని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ని సిద్ధం చేయాలని ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఈ సమస్యను "అపారమైన ప్రాముఖ్యత" ఉన్న అంశంగా సుప్రీంకోర్టు పేర్కొంది. అందుకే ఈ సమస్యపై ఒకటే జాతీయ విధానాన్ని రూపొందించడానికి అన్ని రాష్ట్రాలను భాగస్వామ్యం చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.