SD Pay App Scam: రూ.1,211 కోట్ల డిజిటల్ వాలెట్ మోసం.. 15 లక్షల మందిని బురిడీ కొట్టించిన యాప్
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లో వెలుగుచూసిన భారీ డిజిటల్ వాలెట్ మోసం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తక్కువ పెట్టుబడితో రోజువారీగా భారీ లాభాలు వస్తాయంటూ లక్షలాది మందిని నమ్మించి రూ.1,200 కోట్లకు పైగా కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పద్ధతిలో సాగిన ఈ మోసం.. చివరకు యాప్ మూసివేయడంతో బయటపడింది. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాకు చెందిన 'SD Pay' (అప్నా పే) డిజిటల్ వాలెట్ యాప్ ద్వారా పెట్టుబడిదారులను మోసం చేశారు. సెమినార్లు, జూమ్ కాల్స్, వివిధ మార్కెటింగ్ పద్ధతులతో ప్రజలను ఆకర్షించి, వారి పొదుపు సొమ్మును కాజేశారు.
వివరాలు
భారీగా నష్టపోయిన వడోదరకు చెందిన 48 ఏళ్ల ఉపాధ్యాయిని
వడోదరకు చెందిన 48 ఏళ్ల ఉపాధ్యాయిని ఈ మోసంలో భారీగా నష్టపోయారు.
ఒంటరి తల్లిగా జీవిస్తున్న ఆమెకు కాలేజీలో చదువుతున్న కుమారుడు ఉన్నాడు.
2025లో తన 1BHK అపార్ట్‌మెంట్‌ను విక్రయించి వచ్చిన సొమ్ములో రూ.9.5 లక్షలను అప్నా పే యాప్‌లో పెట్టుబడిగా పెట్టారు.
అంతటితో ఆగకుండా తన స్నేహితులు, బంధువులు మరో 31 మందిని కూడా ఈ యాప్‌లో చేరేలా చేశారు.
2026 మధ్య నాటికి ఆమె డిజిటల్ వాలెట్‌లో పెట్టుబడి విలువ రూ.50 లక్షలకు చేరినట్లు కనిపించింది.
అయితే, అదే సమయంలో యాప్ మూసివేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించారు.
వివరాలు
IPO ప్రారంభిస్తామని పెట్టుబడిదారులకు హామీ
గతంలో నెట్‌వర్క్ మార్కెటింగ్ వ్యాపారం చేసిన ఆమె.. 2025 జూలైలో వడోదరలో 'SD Pay' నిర్వాహకుడిని కలిశారు.
తొలుత ఈ యాప్‌లో చేరేందుకు నిరాకరించారు. అయితే, నిర్వాహకులు ఎస్క్రో వాలెట్ (Escrow Wallet) వివరాలు, కొన్ని పత్రాలు చూపించి నమ్మించే ప్రయత్నం చేశారు.
అయినా ఆమె అంగీకరించలేదు. చివరకు సంతకం చేసిన ఖాళీ చెక్కును అందిస్తూ.. నమ్మకం లేకపోతే అందులో కావాల్సిన మొత్తాన్ని రాసుకుని ఎప్పుడైనా నగదు తీసుకోవచ్చని చెప్పారు.
దీంతో ఆమె వారి మాటలను నమ్మి పెట్టుబడి పెట్టారు. త్వరలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రారంభిస్తామని కూడా పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు.
వివరాలు
ప్రధాన నిందితుడిగా ధవల్ పటేల్
మరోవైపు,సురేంద్రనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ యాప్ ద్వారా వచ్చే లాభాలతో ఇల్లు కొనుగోలు చేయాలనే ఆశతో వ్యక్తిగత రుణం,బంగారు రుణం తీసుకున్నారు.
ఇలా సుమారు రూ.60లక్షలు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.సూరత్‌కు చెందిన మరో పెట్టుబడిదారుడు మొదట రూ.1,000పెట్టుబడి పెట్టి,దాన్ని రూ.కోటికి పెంచుకున్నట్లు చూపించారు.
దాదాపు 1.6లక్షల మంది పెట్టుబడిదారులతో కూడిన సిఫార్సుల నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఈ భారీ మోసానికి ప్రధాన నిందితుడిగా ధవల్ పటేల్‌ను పోలీసులు గుర్తించారు.
2024లో ఆయన ఈమొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఉచిత బిల్లుచెల్లింపులు,మొబైల్ రీచార్జ్‌ల పేరుతో భారీ లాభాలు వస్తాయని ప్రచారం చేశారు.
సెమినార్లు,జూమ్ కాల్స్ ద్వారా ప్రజలను ఆకర్షించడంతోపాటు,బాధితులకు సంతకం చేసిన ఖాళీ చెక్కులు ఇచ్చి నమ్మకం కలిగించారు.
వివరాలు
12 మంది నిందితుల అరెస్టు
ఈ యాప్‌ను దాదాపు 15 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. సుమారు 6.52 లక్షల బ్యాంకు ఖాతాల ద్వారా రూ.1,211 కోట్లను కాజేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
2026 సెప్టెంబర్‌లో అమ్రేలి జిల్లాలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు 18 కేసులు నమోదు చేశారు.
ఇప్పటివరకు 12 మంది నిందితులను అరెస్టు చేశారు. రూ.1,200 కోట్లకు పైగా మోసం జరిగినట్లు నిర్ధారించారు.
ఈ మోసం పలు రాష్ట్రాలకు విస్తరించినట్లు గుర్తించారు.
ఆరు కంపెనీలకు చెందిన 38 బ్యాంకు ఖాతాలతోపాటు, 16 మంది కంపెనీ డైరెక్టర్లు నిర్వహిస్తున్న మరో 72 ఖాతాలను కూడా గుర్తించారు.