LOADING...
Adani : విశాఖలో అదానీ ఫౌండేషన్ భారీ ప్రాజెక్టు.. 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మెడికల్ క్యాంపస్
విశాఖలో అదానీ ఫౌండేషన్ భారీ ప్రాజెక్టు.. 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మెడికల్ క్యాంపస్

Adani : విశాఖలో అదానీ ఫౌండేషన్ భారీ ప్రాజెక్టు.. 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మెడికల్ క్యాంపస్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 12, 2026
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడ గ్రామంలో అత్యాధునిక వైద్య, విద్యా, నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసేందుకు అదానీ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 60.29 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు రూ.15 లక్షల రాయితీ ధరను నిర్ణయిస్తూ ఈ భూములను కేటాయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 13 ఎకరాల విస్తీర్ణంలో 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నారు. అదనంగా 15.8 ఎకరాల్లో మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే 4.18 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాల, 9.7 ఎకరాల్లో స్కిల్ అకాడమీని అభివృద్ధి చేయాలని అదానీ ఫౌండేషన్ ప్రణాళిక రూపొందించింది.

వివరాలు

రూ.2,168 కోట్ల పెట్టుబడి..

ఈ సమగ్ర ప్రాజెక్టు కోసం మొత్తం రూ.2,168 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించింది. ఇందులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.713 కోట్లు, మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు రూ.104 కోట్లు, విద్యార్థులు, సిబ్బందికి అవసరమైన వసతిగృహాలు, నివాస భవనాల నిర్మాణానికి రూ.235 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ పాఠశాల నిర్మాణానికి రూ.190 కోట్లు, స్కిల్ అకాడమీ అభివృద్ధికి రూ.241 కోట్లు వెచ్చించనున్నారు.

వివరాలు

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..

అదనంగా వైద్య పరికరాల కొనుగోలుకు రూ.419 కోట్లు, ఫర్నీచర్ కోసం రూ.64 కోట్లు, ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.202 కోట్లను ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి చేసిన సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఈ భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. కాగా, ఇదే భూమిని 2023లో విశాఖ టెక్ పార్క్ లిమిటెడ్‌కు కేటాయించినప్పటికీ, ఆ నిర్ణయాన్ని తాజాగా రద్దు చేసి, అదానీ ఫౌండేషన్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement